హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Noida Twin Towers: ట్విన్ టవర్స్‌ కుప్పకూలిన తర్వాత ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ

Noida Twin Towers: ట్విన్ టవర్స్‌ కుప్పకూలిన తర్వాత ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ

నోయిడా ట్విన్ టవర్స్

నోయిడా ట్విన్ టవర్స్

Noida Twin Towers Demolition: భవనాలు కుప్పకూలిన వెంటనే.. భూమి నుంచి 300 మీటర్ల ఎత్తు వరకు భారీ ధూళి మేఘం ఏర్పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అది భారీ విస్పోటనంలా కనిపిస్తుందని చెబుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఇప్పుడు దేశమంతటా నోయిడా ట్విన్ టవర్స్ (Noida Twin Towers) గురించే మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీలోని కుతబ్ మినార్ (Kutub Minar) కంటే ఎత్తుగా ఉండే ఈ జంట భవనాలు మరికాసేపట్లో కుప్పకూలనున్నాయి. ఏళ్ల తరబడి కట్టిన భవనాలు క్షణాల వ్యవధిలోనే నేలమట్టమవనున్నాయి. 100 మీటర్ల పొడవున్న 40 అంతస్తుల భవనాలు.. కేవలం 9 సెకన్లలోనే పేకమేడలా కూలిపోనున్నాయి.అందుకోసం  ఎడిపైస్ (Edific) సంస్థ అంతా సిద్ధం చేసింది. కాసేపటి క్రితమే ఫైనల్ చెక్ కూడా చేశారు. 3,700 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించి వాటర్‌ఫాల్ ఇంప్లోజన్ (Waterfall Implosion) టెక్నాలజీతో పడగొట్టనున్నారు. అంటే రెండు భవనాలు ఉన్నచోటే నిట్టనిలువునా కిందపడిపోతాయి. చుట్టుపక్కల ఉండే భవనాలకు ఎలాంటి నష్టం జరగదు. జంట భవనాలకు 100 మీటర్ల దూరం నుంచి..  చేతన్‌ దత్తా అనే భారత బ్లాస్టర్‌ ఫైనల్‌ స్విచ్‌ నొక్కుతారు. అనంతరం రెండు భవనాలు కుప్పకూలుతాయి.


  Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చేందుకు అన్ని కోట్ల ఖర్చవుతుందా? ఆ డబ్బులు ఎవరిస్తారు?


  భవనాలు కుప్పకూలిన వెంటనే.. భూమి నుంచి 300 మీటర్ల ఎత్తు వరకు భారీ ధూళి మేఘం ఏర్పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అది భారీ విస్పోటనంలా కనిపిస్తుందని చెబుతున్నారు. ఆకాశం నుంచి దుమ్ముదూళంతా తొలగిపోయి.. సాధారణ స్థితి ఏర్పడేందుకు 15 నిమిషాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఇళ్లల్లోకి దుమ్ము వెళ్లకుండా, వాటికి నష్టం జరగకుండా జియో టెక్స్‌టైల్ కవరింగ్ ఉయోగించారు. అంతేకాదు ట్విన్ టవర్‌కి చుట్టుపక్కల ఒక నాటికల్ మైలు పరిధిలో గగనతలాన్ని మూసి.. విమానాల రాకపోకలను నిలిపివేశారు. అంత పెద్ద భవనాలు కూలిపోవడం వల్ల పెద్ద ఎత్తున దుమ్ము ధూళి గాల్లోకి వ్యాపిస్తుంది. తద్వారా భారీగా వాయు కాలుష్యం జరిగే అవకాశముంది. ఢిల్లీకి కొద్ది దూరంలోనే నోయిడా ఉన్నందున.. ఈ ప్రభావం ఢిల్లీపైనా పడవచ్చు. ఈ రెండు భవనాలు ఉన్నపళంగా కూలిపోవడంతో రిక్టర్ స్కేల్‌పై 0.4 తీవ్రతతో భూమి కంపించే అవకాశముందని అధికారులు తెలిపారు.


  Explained: నొయిడా ట్విన్ టవర్లను ఎందుకు కూల్చివేస్తున్నారు..? తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే..


  ప్రస్తుతం నోయిడాలో వాయువ్య పశ్చిమ దిశ నుంచి గంటకు 15 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. అందువల్ల దుమ్ము దూళి ఢిల్లీ వైపునకు వెళ్లకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గెజ్జా, పాత దాద్రి ప్రాంతాల వైపు వెళ్లే అవకాశముందని భావిస్తున్నారు. ఇవాళ వర్షం పడే సూచనలు కూడా లేకపోవడం వల్ల.. వాయు కాలుష్యం పెరగవచ్చని అధికారులు తెలిపారు. భవనాల కూల్చివేత వల్ల వచ్చే శబ్ధాన్ని, వాయు కాలుష్యాన్ని లెక్కించేందుకు.. ట్విన్ టవర్స్ చుట్టు పక్కల ప్రత్యేకమైన పరికరాలను ఏర్పాటు చేశారు.


  ట్విన్ టవర్స్ కూల్చివేతతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎడిపైస్ సంస్థతో పాటు నోయిడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. చుట్టు పక్కల ప్రాంతాల్లో నివసించే దాదాపు 7వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెంపుడు జంతువులు, వీధి కుక్కలను కూడా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ముందుజాగ్రత్తగా అక్కడ విద్యుత్‌తో పాటు భూగర్భ గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. రెండు భవనాలను కూల్చిన తర్వాత.. సాయంత్రం మళ్లీ వారిని తమ ఇళ్లల్లోకి అనుమతిస్తారు.  ట్విన్ టవర్స్ కూలిపోయిన తర్వాత .. శిథిలాలను సెక్టార్ 80లోని వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌కు తీసుకెళ్తారు.  ఇందుకోసం 3 నెలల సమయం పట్టవచ్చు. అనంతరం  భవన శిథిలాల నుంచి స్టీల్‌ను వేరుచేస్తారు. రెండు భవనాలను కూల్చివేస్తే 55వేల టన్నుల వ్యర్థాలు వస్తాయి. అందులో నాలుగు వేలకు పైగా స్టీలే ఉంటుందని అధికారులు వెల్లడించారు.  ఈ జంట భవనాల కూల్చేందుకు రూ.20 కోట్ల మేర ఖర్చవుతుంది. ఇందులో రూ.5 కోట్లను సూపర్ టెక్ కంపెనీ చెల్లిస్తుంది. మిగిలిన డబ్బును శిథిలాల నుంచి వేరు చేసిన స్టీల్‌ను అమ్మడం ద్వారా సమకూర్చుతారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: National, National News, Noida, Noida Twin Towers

  ఉత్తమ కథలు