హోమ్ /వార్తలు /జాతీయం /

గల్లంతైన AN-32 విమానం కోసం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ గాలింపు

గల్లంతైన AN-32 విమానం కోసం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ గాలింపు

AN-32 విమానం

AN-32 విమానం

సుఖోయ్-30, C-130J స్పెషల్ ఆపరేషన్స్ ఎయిర్‌క్రాఫ్ట్, AN-32 ఎయిర్‌క్రాఫ్ట్, రెండు MI-17, మరో రెండు ఇండియన్ ఆర్మీ ALH హెలికాప్టర్లు రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.

    అరుణాచల్ ప్రదేశ్‌లో గల్లంతైన AN-32 విమానం కోసం ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. 18 గంటలు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో యుద్ధ విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లను రంగంలోకి దింపి గాలిస్తున్నారు. సుఖోయ్-30, C-130J స్పెషల్ ఆపరేషన్స్ ఎయిర్‌క్రాఫ్ట్, AN-32 ఎయిర్‌క్రాఫ్ట్, రెండు MI-17, మరో రెండు ఇండియన్ ఆర్మీ ALH హెలికాప్టర్లు రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. విమానం కూలిపోయిందని వార్తలు రావడంతో గాలింపు బృందాలు అక్కడికి వెళ్లాయి. ఐతే అక్కడ శకలాలేమీ కనిపించలేదని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది.


    AN-32 విమానం సోమవారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమైంది. ఆ విమానంలో ఏడుగురు అధికారులు, మరో ఆరుగురు ఎయిర్ వారియర్స్ ఉన్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాట్‌ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే దాని ఆచూకీ లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో మారుమూలన ఉన్న మెచుకా అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌కు ఆ విమానం చేరుకోవాల్సి ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆ విమానం నుంచి చివరిసారిగా కమ్యూనికేషన్‌ వచ్చింది. ఆ తర్వాత సంబంధాలు తెగిపోయాయి.


    సాధారణంగా మెచుకాకు చేరుకోవడానికి 50 నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ గంటలు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో ప్రత్యేక దళాలను రంగంలోకి దింపి విమానం కోసం గాలిస్తున్నారు. సోవియట్ యూనియన్ రూపొందించిన ఈ విమానాలను 1980లో భారత వైమానికదళంలో చేర్చారు. నాలుగు దశాబ్దాలుగా రవాణా అవసరాల కోసం వినియోగిస్తున్నారు. AN-32 శ్రేణి విమానాల్లో రెండు టర్బోప్రాప్‌ ఇంజిన్లు ఉన్నాయి. పలుమార్లు ఈ విమానాలను ఆధునికీకరించారు. ఐతే అరుణాచల్‌లో అదృశ్యమైన ఆ విమానాన్ని ఆధునీకరించనట్లుగా తెలుస్తోంది.


    గతంలోనూ AN-32 విమానాలు కూలిపోయాయి. 2016లో చెన్నై నుంచి అండమాన్‌ నికోబార్‌ దీవులకు బయలుదేరిన ఏఎన్‌-32 విమానం బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా అదృశ్యమైంది. ఆ విమానం కోసం సుదీర్ఘ కాలం పాటు గాలింపు జరిగింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. కనీసం శకలాలు కూడా దొరకలేదు. దాంతో ఆ విమానంలో ఉన్న 29 మంది మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. 2009 జూన్‌లో మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో మరొ విమానం కూలిపోయింది. ఆ ఘటనలో 13 మంది మరణించారు.


    AN-32 విమాన ప్రమాదాల వివరాలు:


    1986, మార్చి 22న జమ్మూలో ప్రమాదం

    1986, మార్చి 25న అరేబియా సముద్రం

    1991లో కేరళలో కూలిన ఏఎన్-32 విమానం

    1992, మార్చి 26 అసోంలో కూలిన ఏఎన్-32

    1992, ఏప్రిల్ 1న పంజాబ్‌లో విమాన ప్రమాదం

    1999, మార్చి 7న ఢిల్లీలో కూలిన ఏఎన్-32

    2009, జూన్ 9న అరుణాల్‌ ప్రదేశ్‌లో ప్రమాదం

    2014, సెప్టెంబర్ 20న చండీగఢ్‌లో కూలిన ఏఎన్-32

    2016, జులై 22న బంగళాఖాతంలో విమాన అదృశ్యం

    First published:

    Tags: An-32 missing, Indian Air Force, Indian Army

    ఉత్తమ కథలు