కరోనా మహమ్మారి విలయం కారణంగా ఉద్యోగులకు కల్పించిన వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం కొవిడ్ కేసులు తగ్గిన దరిమిలా అన్ని శాఖల్లో ఉద్యోగులందరూ విధిగా ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ 100 శాతం హాజరుతో పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ద్వారా మెమోరాండం జారీ చేసినట్లు ఆ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం ఒక ప్రకటన చేశారు.
ఢిల్లీ సహా దేశమంతటా కొవిడ్ పరిస్థితులు మెరుగుపడిన దృష్ట్యా సోమవారం నుంచి 100% ఉద్యోగుల హాజరుతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి పనిచేస్తాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ‘కొవిడ్ పరిస్థితిపై జరిపిన తాజా సమీక్షలో కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుదలను గుర్తించాం. కాబట్టి సోమవారం నుంచే అన్ని ఆఫీసులు పూర్తి స్థాయిలో పనిచేయాల్సిందిగా ఆదేశాలిచ్చాం. అన్ని స్థాయిల ఉద్యోగులు, ఎటువంటి మినహాయింపు లేకుండా, ఫిబ్రవరి 7, 2022 నుంచి విధిగా ఆఫీసులకు హాజరుకావాలి’అని మంత్రి చెప్పారు.
కాగా, కొవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి, అన్ని కార్యాలయాల్లో అందరు ఉద్యోగులూ ఎల్లవేళలా ఫేస్ మాస్క్ ధరించేలా, ఆఫీసుల్లో కొవిడ్ ప్రోటోకాల్స్ అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల అధిపతులదేనని మంత్రి పేర్కొన్నారు. నిజానికి జనవరి 31నాటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 15 వరకు అన్ని కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించారు. అయితే తాజా సమీక్షలో కొవిడ్ ఉధృతి తగ్గిన నేపథ్యంలోనే ఆ తేదీని ముందుకు జరిపామని, సోమవారం నుంచి ఉద్యోగులు ఎవరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండబోదని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
కొవిడ్ మూడో వేవ్ క్రమంలో ఈ ఏడాది జనవరి 3 నుంచి కేంద్రం తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించడం తెలిసిందే. ఇదిలా ఉంటే, కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,07,474 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,21,88,138కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 12,25,011కి తగ్గాయి. కేసులు తగ్గిన మరణాలు మాత్రం భారీగా కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 865 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా కరోనాకు బలైపోయినవారి సంఖ్య 5,01,979కి చేరుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.