బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఎన్డీయే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ కృషికి కాంగ్రెస్ ద్వారా అడ్డుపుల్ల పడింది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా ఉన్నా.. ఆయన ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. కానీ ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతున్నది. ఆయన ‘యంగెస్ట్ పొలిటీషియన్’ అవార్డుకు ఎంపికయ్యారని సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. మరి ఇందులో నిజమెంత..? ఆయన ఆ అవార్డు గెలుచుకున్నాడా..?
ట్విట్టర్, ఫేస్బుక్ లలో తేజస్వి యాదవ్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతున్నది. 30 ఏళ్ల వయసులోనే రాజకీయాలలో దూసుకుపోతున్న అతడికి.. లండన్ లో ‘యువ రాజకీయ నాయకుడు’ అనే అవార్డు ప్రధానం చేసినట్టు వార్త చెక్కర్లు కొడుతున్నది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఫేక్ న్యూస్ బెండు తీసే ఒక ఆంగ్ల వెబ్ సైట్ దీని కథా కమామిషును తేల్చింది.
వివరాల్లోకెళ్తే... 2016 లో బీహార్ లో జేడీ(యూ) తో కలిసి ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన 2016 ఆగస్టు 17న స్విట్టర్లాండ్ లోని జెనీవాలో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆయన అక్కడ పలువురు అధికారులతో సమావేశమయ్యారు. ఆ నేపథ్యంలో తీసుకున్న ఫోటోలే అవి. ఆ ఫోటోలనే ఇప్పుడు పలువురు కొంచెం మార్పులు చేసి.. తేజస్వికి యంగెస్ట్ పొలిటిషియన్ అవార్డు వచ్చినట్టు ప్రచారం సాగించారు. బీహార్ ఎన్నికల సమయంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.
Had fruitful meeting with UNECE & IRF at United Nations HQs in Geneva. pic.twitter.com/3hGva2Ab6Y
— Tejashwi Yadav (@yadavtejashwi) August 17, 2016
అయితే ఆ ఫోటోలో తేజస్వి వెనకాలా ఉన్న భవనంపై ఐక్యారాజ్యసమితికి సంబంధించిన పదాలు ఫ్రెంచ్ లో రాసి ఉన్నాయి. ఆయన పెట్టుకున్న ఐడీ కూడా అదే సూచిస్తుందని సదరు ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ తేల్చింది.
కాగా, ఇటీవలే ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తేజస్వి సీఎం అవడం ఖాయమని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఎన్డీయే పుంజుకుంది. అయినా కూడా తేజస్వి యాదవ్ నేతృత్వం వహిస్తున్న ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. జేడీ (యూ) దారుణంగా ఓడిపోయినా నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో పొత్తే ఆర్జేడీని ముంచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్జేడీ 75 స్థానాలకు పైగా గెలవగా... కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీకి దిగి.. 19 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. దీంతో తేజస్వి ఆశలు అడియాసలయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar Assembly Elections 2020, Fact Check, NDA, Tejaswi Yadav