భారత్-పాకిస్తాన్ సరిహద్దులో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రెచ్చిపోతున్నారు. భారత సైన్యం పోస్టులు, సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. మరోవైపు ఉగ్రవాదులు సైతం భారత్‌లో చొరబడేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నవంబరు 13న గురేజ్, ఉరి సహా పలు సెక్టార్లలో భారత్, పాకిస్తాన్ ఆర్మీ మధ్య భీకర కాల్పులు జరిగాయి. పాక్ రేంజర్ల కాల్పుల్లో పలువురు జవాన్లు, పౌరులు మరణించడంతో భారత సైన్యం ఎదురు దాడి చేసింది. రాకెట్లు, మిస్సైల్స్‌ను ఎక్కుపెట్టి పాకిస్తాన్ బంకర్లను పేల్చేసింది.
ఐతే సరిహద్దులో పాకిస్తాన్ చెలరేగిపోతున్న నేపథ్యంలో.. భారత సైన్యం మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేసిందని గురువారం రాత్రి పలు మీడియా ఛానెళ్లలో వార్తలు వచ్చాయి. పీవోకేలోకి భారత సైనిక బృందాలు దూసుకెళ్లి.. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయని పేర్కొన్నాయి. టెర్రర్ లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశాయని కథనాలు ప్రసారం చేశాయి. దీనిని సర్జికల్ స్ట్రైక్ 3గా పేర్కొంటూ ట్విటర్లో నెటిజన్లు ట్వీట్ల మోత మోగించారు. ఇండియన్ ఆర్మీ, సర్జికల్ స్ట్రైక్ 2 పేర్లను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో భారత ఆర్మీ స్పందించింది. గురువారం ఎల్వోసీ వెంబడి ఎలాంటి కాల్పులు జరగలేదని స్పష్టం చేసింది.
Reports of Indian Army's action in Pakistan-occupied Kashmir (PoK) across the Line of Control are fake: Indian Army Director General of Military Operations Lt Gen Paramjit Singh
— ANI (@ANI) November 19, 2020
(file photo) pic.twitter.com/uHlULDWydh
ఈ ప్రచారంపై PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని.. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని ప్రజలకు సూచించింది. సరిహద్దు వెంబడి ఎలాంటి కాల్పులు జరగలేదని తెలిపింది.
Several media outlets are claiming that the Indian Armed Forces carried out strikes on suspected terror launch pads across the #LOC.#PIBFactCheck: This claim is #Fake. There has been no firing across the LOC today. pic.twitter.com/oeIRujRY9Z
— PIB Fact Check (@PIBFactCheck) November 19, 2020
కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.
కాగా, గురువారం జమ్మూకాశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేసిన విషయం తెలిసిందే. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఉగ్రమూకలను మట్టబెట్టాయి. గురువారం ఉదయం జమ్మూ-శ్రీనగర్ హైవేపై బాన్ టోల్‌ప్లాజా వద్ద భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పోలీస్‌కు గాయాలయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Army, Jammu and Kashmir