ఏ సంస్థ కూడా తమ ఉద్యోగుల పట్ల, ప్రత్యేకించి ఒక అభాగ్య ఉద్యోగి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడానికి వీల్లేదని స్పష్టం చేసింది బాంబే హై కోర్టు. ఒక వికలాంగ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించిన ప్రభుత్వ సంస్థను కోర్టు మందలించింది. బాధితుడికి అందాల్సిన అన్ని బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. పక్షవాతంతో బాధపడుతున్న ఒక ఉద్యోగి పట్ల మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కర్కశంగా ప్రవర్తించింది. కష్టకాలంలో అతన్ని ఆదుకోవాల్సింది పోయి మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. డ్యూటీ చేయడానికి నువ్వు పనికిరావు అంటూ ఉద్యోగం నుంచి తొలగించింది.
ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఉద్యోగం పోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించాలనే మానసిక ఒత్తిడితో అతడు సతమతమయ్యాడు. ఉద్యోగం నుంచి తనని తొలగించడం అన్యాయమని కోర్టును ఆశ్రయించాడు. న్యాయపోరాటం చేస్తూనే 2020లో కన్నుమూశాడు. అయితే అతడి అభ్యర్థన తాజాగా విచారణకు రావడంతో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాదు, బాధిత ఉద్యోగి వైద్య బిల్లులతో సహా పాత బకాయిలను చెల్లించాలని హైకోర్టు కంపెనీని ఆదేశించింది.
రమేష్ ఘోలేవ్ అనే వ్యక్తి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో టెక్నీషియన్ గా పని చేసేవాడు. అతడికి నవంబర్ 2014లో హఠాత్తుగా పక్షవాతం వచ్చింది. తర్వాత 2017, 2019 మధ్యకాలంలో కూడా పెరాలిటిక్ అటాక్ (paralytic attack)తో బాధపడ్డాడు. దాంతో మే 2018లో మెడికల్‌గా అన్‌ఫిట్‌గా ఉన్నావంటూ రమేష్ ని కనికరం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ. ఐతే రమేష్ తేలికైన ఉద్యోగం చేయడానికి శారీరకంగా దృఢంగానే ఉన్నాడని వివిధ న్యూరాలజిస్ట్‌లు పేర్కొన్నారు. ఆ డాక్టర్ల వైద్య రికార్డులను చేతపట్టుకుని తనకు తేలికైన ఉద్యోగం ఇవ్వమని కంపెనీని, ఇతర అధికారులను విన్నవించుకున్నాడు రమేష్. కానీ కంపెనీ అందుకు ససేమిరా అంది. చేసేదిలేక అతను తన తొలగింపును సవాలు చేసేందుకు వికలాంగుల (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ, పూర్తి భాగస్వామ్యం) చట్టం, 1995, వికలాంగుల హక్కుల చట్టం, 2016పై ఆధారపడ్డాడు. బాంబే హైకోర్టు తలుపు తట్టి తనకు న్యాయం చేయాలని అభ్యర్థన పెట్టుకున్నాడు.
తాజాగా అతడి అభ్యర్థనను న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, సంజయ్ మెహరేలతో కూడిన ధర్మాసనం విచారించింది. 2020లో మరణించిన రమేష్ ఘోలావేను ఎంఎస్ఈడీసీఎల్ (MSEDCL) చట్టవిరుద్ధంగా తొలగించిందని ధర్మాసనం కన్నెర్ర చేసింది. ఘోలావే భార్య సమర్పించిన వైద్య రికార్డులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ధర్మాసనం ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ వైద్య రికార్డులు ప్రకారం, మృతుడు రమేష్ తేలికైన జాబ్ ఇవ్వాలని అభ్యర్థించినప్పుడు 65 శాతం మంది ఫిజికల్ ఫిట్‌గా ఉన్నాడు. వీటిని గమనించిన హైకోర్టు ధర్మాసనం ఎంఎస్ఈడీసీఎల్ కు చురకలంటించింది. ఏ యజమాని కూడా తమ ఉద్యోగి పట్ల, ప్రత్యేకించి ఒక అభాగ్య ఉద్యోగి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించకూడదని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ ఎంఎస్ఈడీసీఎల్ ని తిట్టిపోసింది. అంతేకాదు చనిపోయిన ఉద్యోగి వైద్య బిల్లులను కుటుంబానికి రీయింబర్స్ చేయాలని.. పాత బకాయిల(arrears)ను కూడా తిరిగి చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
మృతుడి భార్య అందించిన సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు, "అంగవైకల్య వ్యాధితో దురవస్థలోకి జారుకున్న వ్యక్తి తన కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆందోళన పడతాడు. కొన్ని సందర్భాల్లో స్థోమతకు మించి వైద్య ఖర్చులు చేయాల్సి వస్తుంది. ప్రస్తుత కేసులో ఉద్యోగి భార్య వద్ద దాదాపు రూ.12 లక్షల ఖర్చవుతుందని సూచించడానికి అనేక వైద్య పత్రాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులతో బాధపడుతున్న ఒక ఉద్యోగి పట్ల సంస్థలు రాతి హృదయంతో కాకుండా సానుభూతి, కరుణతో ప్రవర్తించాలి. కానీ యజమానులు మానవత్వం లేకుండా ప్రవర్తించారు. విధి చిన్నచూపు చూసిన ఉద్యోగి పట్ల సంస్థలు అలా ఉండకూడదు " అని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bombay high court, Employees