No duty for women from 7 pm : ఉత్తరప్రదేశ్(UttarPradesh)లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న యోగి సర్కార్ తాజాగా మహిళలకు శుభవార్త చెప్పింది. ఫ్యాక్టరీల్లో ఉపాధి పొందే మహిళల పని వేళలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మే 27న జారీ చేసిన నోటిఫికేషన్‌లో..ఫ్యాక్టరీల్లో మహిళల చేత ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తర్వాత పని చేయించరాదని ఆదేశించింది. ఒకవేళ పని చేయిస్తే ఆ మహిళలకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలను కల్పించాలని తెలిపింది. వారికి రక్షణ కల్పించే విధంగా పర్యవేక్షణను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మహిళలు పని చేయవలసి వస్తే, కనీసం నలుగురు మహిళలు కలిసి ఉండేలా చూడాలని తెలిపింది. లైంగిక వేధింపులను నిరోధించేందుకు తగిన చర్యలను తీసుకోవాలని తెలిపింది. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, బట్టలు మార్చుకునేందుకు గదులను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపింది. లిఖితపూర్వక సమ్మతి తెలియజేసినపుడు మినహా, ఏ మహిళ చేత అయినా ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తర్వాత పని చేయించరాదని తెలిపింది. రాత్రి ఏడు గంటల తర్వాత కానీ, ఉదయం 6 గంటలకు ముందు కానీ పని చేయడానికి తిరస్కరించిన మహిళను ఉద్యోగం నుంచి తొలగించరాదని చెప్పింది.
ALSO READ Supriya Sule : ఇంటికెళ్లి వంట చేసుకో వ్యాఖ్యలపై పవార్ కూతురికి బీజేపీ చీఫ్ క్షమాపణలు
ఈ ఆదేశాలు ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు కంపెనీలు, ఆఫీసులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. అంతేకాకుండా.. ఇక నుంచి మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీ చేయమని బలవంతం చేయడానికి వీలు లేదు.. అవసరమైన సేవలు మినహా అన్ని విభాగాలతో పాటు ప్రైవేట్ సంస్థలలో ఈ నిబంధనలు వర్తిస్తాయని సమాచార ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ తెలిపారు. అలాగే, ఆఫీసుల్లో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, త్రాగునీటి సౌకర్యాలతో పాటు పని చేసే ప్రదేశంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా, మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా.. వారు తమ కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, WOMAN, Yogi adityanath