NIVAR CYCLONE LIVE UPDATES HIGH ALERT IN TAMILNADU AND ANDHRAPRADESH MS
Nivar Cyclone: తమిళనాడులో కుంభవృష్టి.. రేపు సెలవు.. ప్రజలు ఇళ్లు విడిచివెళ్లొద్దని సూచన
ప్రతీకాత్మక చిత్రం
Nivar Cyclone Updates: నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను తమిళనాడుపై ఇప్పటికే పంజా విసురుతున్నది. తుఫాను కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.
నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను తమిళనాడుపై ఇప్పటికే పంజా విసురుతున్నది. తుఫాను కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తున్నది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుతున్నది. పట్టాలం, మామల్లపురం, కరైకల్, సైదాపేట్, ఎగ్మూర్ తో పాటు.. ఇతర ప్రాంతాల్లోనూ వర్షం ఏకధాటిగా కురుస్తున్నది. ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా, నివర్ తుఫాన్ కారణంగా తమిళనాడు ప్రభుత్వం బుధవారం సెలవు దినంగా ప్రకటించింది.
నివర్ తుఫాను కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లోకి మోకాలి లోతు నీరు వచ్చింది. రానున్న రెండు, మూడు రోజుల్లో నివర్ తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ప్రజలకు తెలిపింది. బుధవారం సెలవు దినంగా ప్రకటించింది.
నివర్ తుఫాన్ ప్రభావంతో ఏపీ కూడా అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు చెన్నైతో పాటు పుదుచ్చేరి లోనూ నివర్ ప్రభావాన్ని చూపిస్తున్నది. ప్రజలెవరూ బయటకెళ్లొద్దని ప్రభుత్వం కోరింది. దీంతో అక్కడ 144 సెక్షన్ విధించారు. కాగా.. తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిచే తమిళనాడు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.