ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ మంగళవారం ఆయనకు ఫోన్ చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏడాది క్రితం ఆర్జేడీతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో జట్టు కట్టిన తర్వాత నితీశ్ కుమార్, లాలూతో మాట్లాడడం ఇదే తొలిసారి కావడం విశేషం. పశుదాణా కుంభకోణం కేసులో జైలు జీవితాన్ని గడుపుతున్న లాలూ...ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్య కారణాలతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పాత మిత్రులైన లాలూ, నితీశ్ మధ్య మళ్లీ స్నేహం చిగురించి...త్వరలోనే జేడీయు తిరిగి ‘మహాఘట్‌బంధన్’కు వెనుదిరగొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ కథనాలను లాలూ తనయుడు తేజస్వి యాదవ్ తోసిపుచ్చారు. మహాఘట్‌బంధన్‌లో చేరేందుకు జేడీయుకు తలుపులు తెరిచి లేవని స్పష్టంచేశారు. మహాఘట్‌బంధన్‌లో చేరేందుకు జేడీఎస్ ముందుకు వస్తే ఆలోచిస్తామంటూ కాంగ్రెస్ వర్గాలు చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అలా నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్‌కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తేజస్వి యాదవ్ వ్యాఖ్యలు ఎలా ఉన్నా...లాలూకు నితీశ్ కుమార్ యాదవ్ ఫోన్ చేసి మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లకు సంబంధించి జేడీయు-బీజేపీ మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహంతోనే నితీశ్ కుమార్...లాలూకు ఫోన్ చేసి ఉండొచ్చన్న కథనాలు వెలువడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, JDU, Lalu Prasad Yadav, Nitish Kumar, Tejaswi Yadav