ముంబై ముంగిట మరో ముప్పు.. 130 ఏళ్ల తర్వాత మళ్లీ..

నిసర్గ తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీచే అవకాశముంది. గంటలకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తుఫాన్ ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతాయని.. చెట్లు నేలకూలే ప్రమాదముందని తెలిపింది.

news18-telugu
Updated: June 2, 2020, 3:23 PM IST
ముంబై ముంగిట మరో ముప్పు.. 130 ఏళ్ల తర్వాత మళ్లీ..
నిసర్గ తుఫాన్
  • Share this:
కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న ముంబైకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ముంబై మహానగరాన్ని ముంచెత్తేందుకు నిసర్గ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం.. సోమవారం వాయుగుండంగా బలపడింది. మంగళవారం మధ్యాహ్నానికి అది తుఫాన్‌గా బలపడి తీరం వైపు కదులుతోంది. నిసర్గగా పిలుస్తున్న ఈ తుఫాన్.. ప్రస్తుతం గోవాలోని పాంజిమ్‌కు నైరుతి దిశగా 280 కి.మీ, ముంబయికి దక్షణ నైరుతి దిశగా 450 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షణ నైరుతి దిశలో 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్లో వాతావరణవిభాగం పేర్కొంది. ఈ తుపాను జూన్‌ 3 మధ్యాహ్నానికి దక్షిణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర తీరాలను దాటుతుందని తెలిపింది. డామన్, హరిహరేశ్వర్ (మహారాష్ట్ర) మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది.

నిసర్గ తుఫాన్ ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్‌పై ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ముంబైపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశముందని హెచ్చరించారు. ముంబైని చివరగా 2009 నవంబరులో ఫయాన్ తుఫాన్ తాకిందని ప్రముఖ వాతావరణ నిపుణుడు జాసన్ నికోలస్ తెలిపారు. అంతేకాదు 1891లో జూన్‌ నెలలో చివరిసారిగా ముంబైని తుఫాన్ ముంచెత్తిందని.. మళ్లీ 130 ఏళ్ల తర్వాత జూన్ నెలలో ముంబై తీరానాన్ని తుఫాన్ ముంచెత్తబోతోందని పేర్కొన్నారు.


నిసర్గ తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీచే అవకాశముంది. గంటలకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తుఫాన్ ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతాయని.. చెట్లు నేలకూలే ప్రమాదముందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర, గుజరాత్, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్‌కు 33 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. గుజరాత్ తీవ్ర ప్రాంతాల నుంచి ఇప్పటికే 20 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఇక నిసర్గ తుఫాన్‌పై ప్రధాని మోదీ సమీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్‌తో పాటు మహారాష్ట్ర, గుజరాత్ అధికారులతో ఆయన మాట్లాడారు. అందరూ క్షేమంగా ఉందాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. తుఫాన్ దూసుకొస్తోందని ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

First published: June 2, 2020, 3:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading