Currency Notes: కరెన్సీ నోట్ల ముద్రణపై నిర్మలా సీతారామన్​ క్లారిటీ.. ఆ ఆలోచనే లేదని లోక్​సభలో స్పష్టం..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫొటో)

కరోనా వైరస్​ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు కరెన్సీ ముద్రణ పెంచాలని ఇటీవల కొంతమంది ఆర్థిక నిపుణులు సూచించిన విషయం తెలిసిందే.

  • Share this:
కరోనా వైరస్​ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు కరెన్సీ ముద్రణ పెంచాలని ఇటీవల కొంతమంది ఆర్థిక నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని లోక్​సభలో కొంత మంది సభ్యులు లేవనెత్తారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కరెన్సీ నోట్లను ముద్రించే యోచనలో ప్రభుత్వం ఉందా? అని ఒక పార్లమెంట్​ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ సమాధానమిచ్చారు.‘ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకునేందుకు, ఉద్యోగాలను కాపాడుకునేందుకు నోట్ల ముద్రణను చేపట్టాలని పలువురు ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఏమీ లేదు’ అని మంత్రి చెప్పారు. 2020–21 మధ్యకాలంలో భారత జీడీపీ 7.3 శాతానికి క్షీణించిందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి లోక్​సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఫలితాలు కరోనా వైరస్​ కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతిభింభిస్తున్నాయని తెలిపారు.

అన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రేరేపిత లాక్​డౌన్లు ముగిసిపోవడంతో ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతోందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్​ భారత్​ మిషన్​ సహకారంతో 2020–21 ద్వితీయార్ధం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఆత్మనిర్భర్​ భారత్ (ఏఎంబీ)​ కింద దాదాపు రూ. 29.87 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మరొక ప్రశ్నకు సమాధానంగా సీతారామన్ మాట్లాడుతూ.. కరోనా సెకండ్​ వేవ్​ కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, టీకా డ్రైవ్ వేగవంతం చేయడంతో చాలా వరకు కరోనా స్థాయిని తగ్గించగలిగామని అన్నారు.

ఆర్థిక సంక్షోభం వేళ నిపుణుల సలహా..
ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కరెన్సీ నోట్లను ముద్రించాలని ఈ నెల ప్రారంభంలో ఆర్థికవేత్త పినాకి చక్రవర్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ)ని కోరారు. తద్వారా, మార్కెట్​లో కరెన్సీ ప్రవాహం పెరిగి, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అభిజిత్ బెనర్జీ వంటి ఆర్థికవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పేదలకు సహాయం చేయడానికి, జీవనోపాధిని కాపాడటానికి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటానికి మరిన్ని కరెన్సీ నోట్లను ముద్రించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
Published by:Sumanth Kanukula
First published: