నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు దోషులు అక్షయ్ ఠాగూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముకేష్ సింగ్‌లను ఇవాళ ఉదయం తీహార్ జైల్లో ఉరితీశారు. వీరు నలుగురికి గతంలో మూడుసార్లు డెత్ వారెంట్లు రద్దయ్యాయి. దీంతో ఈ సారి కూడా చివరి నిమిషం వరకు కూడా ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ కొనసాగింది. గత రాత్రి ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష అమలును నిలుపుదల చేసేందుకు నిరాకరించడంతో దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్..అర్థరాత్రి దాటక సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్‌ను ఆశ్రయించారు. అక్కడ కూడా నిర్భయ దోషులకు ఊరట దక్కలేదు. గంట పాటు వాదనలు అనంతరం సరైన కారణం లేనందున ఉరిశిక్ష అమలును నిలుపుదల చేయలేమని శుక్రవారం వేకువజామున 2.30 గం.లకు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో నిర్భయ దోషులు నిద్రలేని రాత్రి గడిపారు. రాత్రి చాలా చేపటి వరకు నలుగురు దోషులు వారి సెల్‌లో అటూ ఇటూ తిరుగుతూ కనిపించినట్లు జైలు అధికారులు తెలిపారు. జైలు నిబంధనల మేరకు నాలుగు వేర్వేరు సెల్స్‌లో ఉంటున్న నిందితులను వేకువజామున మూడున్నర గం.లకు తీహార్ జైలు అధికారులు లేపారు. వైద్య పరీక్షలు నిర్వహించి నలుగురు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్థారించుకున్నారు. ఉదయం 5 గం.లకు ఉరిశిక్ష అమలుచేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. సరిగ్గా ఉదయం 5.30 గం.లకు ఉరితీశారు.
నలుగురు దోషులకు ఢిల్లీ పటియాలా కోర్టు మార్చి 5న జారీ చేసిన డెత్ వారెంట్ల మేరకు శుక్రవారం ఉదయం ఐదున్నర గంటలకు ఉరితీసినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. దోషులను ఉరితీసేందుకు మూడ్రోజుల క్రితం మంగళవారం తలారీ పవన్ తీహార్ జైలుకు చేరుకున్నాడు. మూడ్రోజుల క్రితమే డమ్మీలకు ఉరితీశారు. శుక్రవారం ఉదయం 5.30 గం.లకు లైవర్‌ను లాగి నలుగురు దోషులను ఉరితీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirbhaya case