Cylinder Blast: గ్యాస్ లీకైందని గమనించక లైట్ వేశాడు.. సిలిండర్ పేలి ఒకే ఫ్యామిలీలో 9 మంది మృతి

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో ఉన్న వారిలో ఓ వ్యక్తి నిద్రలేచి లైట్ వేశాడు. అప్పటికే గ్యాస్ లీకై గది మొత్తం కమ్ముకోవడం.. అది గమనించకుండా అతడు లైట్ వేయడంతో.. భారీ పేలుడు సంభవించింది.

  • Share this:
    గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నగర శివారులోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు సంభవించింది. జులై 20న ఈ ఘటన చోటుచేసుకుంది. సిలిండర్ పేలుడు ధాటికి ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు అహ్మదాబాద్ శివారులో ఓ చిన్న రూమ్‌లో అద్దెకు ఉంటూ స్థానికంగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఐతే జులై 20న వారి కిచెన్‌లో ఉన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకయింది. వారు అప్పటికే నిద్రపోయి ఉండడంతో ఎవరూ గమనించలేదు. పక్కింట్లో ఉండే ఓ వ్యక్తికి గ్యాస్ వాసన రావడంతో హుటాహుటిన వచ్చాడు. డోర్ కొట్టి వారిని నిద్రలేపాడు. డోర్‌ను తట్టిన శబ్ధం రావడంతో ఇంట్లో ఉన్న వారిలో ఓ వ్యక్తి నిద్రలేచి లైట్ వేశాడు. అప్పటికే గ్యాస్ లీకై గది మొత్తం కమ్ముకోవడం.. అది గమనించకుండా అతడు లైట్ వేయడంతో.. భారీ పేలుడు సంభవించింది.

    ఈ ఘటనలో ఇంట్లో ఉన్న తొమ్మిది మందితో పాటు వారిని నిద్రలేపేందుకు వచ్చిన పక్కింటి వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వారంతా కాలిన గాయాలతో పలు ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతూ ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. గురువారం ముగ్గురు, శుక్రవారం ఐదుగురు చనిపోయారు. చికిత్స పొందుతూ ఇవాళ మరొకరు కన్నుమూశారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. మరొకరికి చికిత్స కొనసాగుతోంది. సిలిండర్ పేలిన ఘటనలో రామ్‌ప్యారీ అహిర్వార్ (56), రాజుభాయ్ అహిర్వార్ (31), సోను అహిర్వార్ (21), సీమ అహిర్వార్ (25), సర్జు అహిర్వార్ (22), వైశాలి (7), నితేష్ (6), పాయల్ (4), ఆకాశ్ (2) మరణించినట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు. వీరంతా మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన వారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించినట్లు వెల్లడించారు. ఒకే కుటుంబంలో 9 మంది మరణించడంతో గుణ జిల్లాలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

    ప్రస్తుతం కుల్‌సిన్హ్ భైర్వా (30) అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి స్వస్థలం రాజస్థాన్‌లోని కరౌలి. గ్యాస్ వాసన రావడంతో ఆ ఇంట్లో వారికి చెప్పేందుకు వెళ్లి కుల్‌సిన్హ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: