హోమ్ /వార్తలు /జాతీయం /

సంఝౌతా పేలుళ్ల కేసులో తీర్పు వాయిదా.. ఆమె పిటిషన్ వల్లే..!

సంఝౌతా పేలుళ్ల కేసులో తీర్పు వాయిదా.. ఆమె పిటిషన్ వల్లే..!

పేలుడుకు దెబ్బతిన్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ బోగీలు (Getty Images)

పేలుడుకు దెబ్బతిన్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ బోగీలు (Getty Images)

Samjhauta Express Blast Verdict : ఫిబ్రవరి 18, 2007లో జరిగిన ఈ ఘటనలో స్వామి అసిమానంద సహా మరికొందరు నిందితులుగా ఉన్నారు. న్యాయస్థానం తుది తీర్పు వెలువరిస్తే వీరి భవితవ్యం ఏంటన్నది వెల్లడి కానుంది.

  సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో తీర్పును ఎన్ఐఏ పంచకుల కోర్టు మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు మార్చి 6వ తేదీన దీనిపై తుది విచారణ చేపట్టిన న్యాయస్థానం మార్చి 11కి తీర్పును రిజర్వ్ చేసింది. పాకిస్తాన్‌కు చెందిన రహీలా ఎల్ వకీల్ అనే మహిళ కేసుకు సంబంధించి కొత్త ఆధారాలను సమర్పించడానికి తనకు అనుమతివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


  12ఏళ్ల క్రితం జరిగిన సంఝౌతా పేలుళ్ల ఘటనలో తన తండ్రి కూడా చనిపోయినట్టు పాక్ మహిళ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసులో చాలామంది ప్రత్యక్ష సాక్షులు పాకిస్తాన్‌కు చెందినవారేనని.. వారెవరూ ఇంతవరకు కోర్టు ముందు ప్రవేశపెట్టబడలేదని ఆమె తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు కోర్టు ముందుకు వచ్చి సాక్షం చెప్పడానికి సిద్దంగా ఉన్నారని.. కానీ వారికి వీసాలు ఇవ్వట్లేదని అన్నారు. సరైన సాక్ష్యాధారాలు లేకుండా కేసులో తీర్పును వెల్లడిస్తే బాధితులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. దీంతో న్యాయస్థానం కేసుకు సంబంధించిన తీర్పును మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది.


  ఫిబ్రవరి 18, 2007లో జరిగిన ఈ ఘటనలో స్వామి అసిమానంద సహా మరికొందరు నిందితులుగా ఉన్నారు. న్యాయస్థానం తుది తీర్పు వెలువరిస్తే వీరి భవితవ్యం ఏంటన్నది వెల్లడి కానుంది. కాగా, అప్పటి ఘటనలో దాదాపు 68 మంది చనిపోగా.. అందులో ఎక్కువమంది పాకిస్తానీలే ఉన్నారు. రైలు భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్తుండగా హర్యానాలోని పానిపట్ వద్ద ఈ ఘటన జరిగింది.


  కేసుకు సంబంధించిన చార్జిషీటులో ఎన్ఐఏ 8మందిని నిందితులుగా చేర్చింది. అయితే సోమవారం నాడు కోర్టు ముందు మాత్రం నలుగురు నిందితులనే ప్రవేశపెట్టింది. ఇందులో స్వామి అసిమానంద(బెయిల్‌పై బయట ఉన్నారు), లోకేశ్ శర్మ( ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో), కమల్ చౌహాన్(జ్యుడిషియల్ కస్టడీ), రాజిందర్ చౌదరి(జ్యుడిషియల్ కస్టడీ) ఉన్నారు. 2010 వరకు ఈ కేసును సిట్ విచారించగా.. ఆ తర్వాత ఎన్ఐఏ చేతికి వచ్చింది.


  కేసులో నిందితుడైన అసిమానంద మొదట నేరాన్ని ఒప్పుకున్నారు. తానూ మరికొంతమంది రైట్ వింగ్ కార్యకర్తలు కలిసి ఈ పేలుళ్లలో పాలు పంచుకున్నట్టు విచారణలో వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఆయన మరో వాదన వినిపించారు. తనచేత బలవంతంగా అలా చెప్పించారని.. సంఝౌతా పేలుళ్ల ఘటనతో తనకు సంబంధం లేదని చెప్పారు. డిసెంబర్, 2016లో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం బయటే ఉన్నారు.

  First published:

  Tags: Bomb blast, Haryana, Indian Railways, Train

  ఉత్తమ కథలు