సంఝౌతా ఎక్స్ప్రెస్ రైలు పేలుళ్ల కేసులో పంచకులలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అసీమానంద సహా నలుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. నాబాకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానంద, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పులు వెల్లడించింది. నిందితులపై ఆరోపణలను రుజువు చేయడంలో ఎన్ఐఏ విఫలం కావడంతో నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు.
ఫిబ్రవరి 18, 2007లో సంఝాౌతా ఎక్స్ప్రెస్ రైలులో పేలుడు జరిగింది. భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్తుండగా హర్యానాలోని పానిపట్ వద్ద ఈ ఘటన జరిగింది. అప్పటి ఘటనలో దాదాపు 68 మంది చనిపోగా.. అందులో ఎక్కువమంది పాకిస్తానీలే ఉన్నారు. మృతుల్లో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు.
2010 వరకు ఈ కేసును సిట్ విచారించగా..ఆ తర్వాత ఎన్ఐఏ చేతికి వచ్చింది. దేశంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో నిందితులు ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఆ క్రమంలో పాకిస్తాన్కు వెళ్లే సంఝౌతా ఎక్స్ప్రెస్ రైలును పేల్చేయాలని కుట్రచేసినట్లు పేర్కొంది. కేసుకు సంబంధించిన చార్జిషీటులో ఎన్ఐఏ 8మందిని నిందితులుగా చేర్చింది.ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న సునీల్ జోషి 2007 డిసెంబరులో మరణించారు. మధ్యప్రదేశ్లోని తన నివాసం సమీపంలో పోలీసుల కాల్పుల్లో అతడు చనిపోయాడు. మరో ముగ్గురు నిందితులు రామచంద్ర కల్సంగ్రా, సందీప్ దంగే, అమిత్ ఇప్పటికీ చిక్కలేదు. మరో నిర్దోషులుగా తేల్చింది ఎన్ఐఏ కోర్టు.
కేసులో నిందితుడైన అసిమానంద మొదట నేరాన్ని ఒప్పుకున్నారు. తానూ మరికొంతమంది రైట్ వింగ్ కార్యకర్తలు కలిసి ఈ పేలుళ్లలో పాలు పంచుకున్నట్టు విచారణలో వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఆయన మరో వాదన వినిపించారు. తనచేత బలవంతంగా అలా చెప్పించారని.. సంఝౌతా పేలుళ్ల ఘటనతో తనకు సంబంధం లేదని చెప్పారు. డిసెంబర్, 2016లో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం బయటే ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.