Strap: వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాసక్తిని పోగొట్టడానికి, వ్యాక్సిన్ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచి, చేరుకోవడానికి ఇబ్బందిగా ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా COVID వ్యాక్సిన్ సులభంగా అందజేయడమే ప్రచార లక్ష్యం.
ప్రపంచవ్యాప్తంగా COVID-19 ఇన్ఫెక్షన్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 187 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకగా, 4 మిలియన్లకు పైగా మంది దీని బారిన పడి ప్రాణాలు వదిలారు. భారతదేశం విషయానికి వస్తే 30 మిలియన్లకు పైగా మంది వైరస్ బారిన పడగా, 4.1 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయి ప్రపంచంలో మన దేశం రెండో స్థానంలో ఉంది. ఒకవైపు COVID-19 కోసం మందు కనిపెట్టడానికి ప్రపంచం ప్రయత్నిస్తుంటే, మరోవైపు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ద్వారా ఈ భయంకర ఇన్ఫెక్షన్ నుండి మన కుటుంబాలను రక్షించుకునే అవకాశం లభించింది.
భారతదేశంలో జనవరి 16, 2021న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం వ్యాక్సిన్ డోసులను పెద్దమొత్తంలో అందిస్తున్న దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంది. అయితే డోసుల సంఖ్య ఎక్కువ ఉన్నా, 1.38 బిలియన్ల భారతదేశ జనాభాతో పోల్చితే, కేవలం 22.3% మందికి మాత్రమే మొదటి డోసు అందితే, కేవలం 5.52% మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో సిటీలకు చెందినవారే ఉన్నారు. కానీ దేశంలో 65% కంటే ఎక్కువ ఉన్న గ్రామీణ, ఆదిమ జనాభాకు ఇప్పటికీ వ్యాక్సినేషన్ చాలా తక్కువ అందుతోంది. ఇలా తక్కువ ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వ్యాక్సిన్ వేయించుకోవడం మీద నిరాసక్తి అనేది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
భారతదేశంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడానికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి, కానీ వ్యాక్సిన్ గురించి ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారం, మూఢనమ్మకాల కారణంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. సాంకేతిక సౌకర్యాలు, విద్యా సదుపాయాలు లేని ప్రాంతాల్లోని ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేయడంలో భాగంగా, Federal Bank, Network 18, United Way Mumbai, Apollo Hospitals సంయుక్తంగా కలిసి Sanjeevani- A shot of life ప్రాజెక్టును ఆవిష్కరించాయి. వ్యాక్సిన్ వేసుకోవడానికి చూపిస్తున్న నిరాసక్తతను తగ్గించి, వ్యాక్సిన్ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచి, అందుకోవడానికి ఇబ్బందిగా ఉన్న మారుమూల ప్రాంత ప్రజలకు కూడా వ్యాక్సిన్ అందేలా చేసే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా 5 జిల్లాల్లో నడుస్తోంది. అవి అమృత్‌సర్, దక్షిణ కన్నడ, గుంటూరు, ఇండోర్, నాసిక్. ఈ జిల్లాల్లోని 1000కి పైగా గ్రామాల్లో 5 లక్షలకు పైగా మందికి వ్యాక్సిన్ వేయడాన్ని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7, 2021న ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమం, నేటి వరకు 2 లక్షలకు పైగా మందికి వ్యాక్సిన్ అందించింది. ఇందుకోసం వివిధ అవగాహన కార్యక్రమాలు, యాక్టివిటీలను నిర్వహించింది. కొవిన్ (Cowin) పోర్టల్‌లో రిజిస్టర్ చేయించుకునేందుకు 10735 మందికి సహాయం అందింది, అలాగే వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లేందుకు 4304 మందికి రవాణా సౌకర్యం కల్పించబడింది. వ్యాక్సిన్ వేయించుకోవడంలో సహాయం చేయడానికి ప్రచారం, ప్రచార బృందాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, సాంకేతికత అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యాక్సిన్ మీద నిరాసక్తత కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్ గురించి ఇదివరకే ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారం కారణంగా చాలా మందిని ప్రచార బృందాలు ఒప్పించలేకపోతున్నాయి.
కానీ ప్రచారం జరుగుతున్న కొద్దీ, ఎన్నో విజయగాథలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సరిగా మాట్లాడి వాళ్లను ఒప్పించగలిగితే చాలా మందిలో వ్యాక్సిన్ మీద నిరాసక్తత తగ్గిపోయింది. చాలా చోట్ల ప్రచార బృందాలతో మాట్లాడిన వాళ్లందరూ వ్యాక్సిన్ గురించి నిజానిజాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. అలాగే ప్రచార బృందాలకు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు లాంటి ప్రభుత్వ సిబ్బంది సహకారం లభించడంతో ప్రచార ప్రాముఖ్యత పెరిగింది.
జాతీయస్థాయిలో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో కమ్యూనికేషన్ ప్రాధాన్యత గురించి Sanjeevani- A shot of life ప్రచార కార్యక్రమం ద్వారా తెలిసింది. అలాగే స్థానికంగా గ్రామాల్లో కలిగి తిరిగి, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెబుతూ, తప్పుడు సమాచారాన్ని అరికట్టాల్సిన అవసరాన్ని కూడా ఈ ప్రచారం తెలియజేసింది.
వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాసక్తతను తగ్గిస్తూనే, వ్యాక్సిన్ అందివ్వడానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అవగాహన పెంచుకున్న తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చే వారికి సరిపడేలా, అలాగే అక్కడికి వచ్చాక ఎటువంటి ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా చూసేలా వ్యాక్సిన్ కేంద్రాలు ఉండాలి. అలా చేయడానికి, ఈ కేంద్రాల్లో పరిశుభ్రత, శానిటేషన్, చెత్త నిర్వహణ చాలా అవసరం. Sanjeevani ప్రచారం ఈ అంశం వైపుగా కూడా పనిచేస్తోంది. 5 జిల్లాల్లో 100 కేంద్రాలను, మెడికల్ అవసరాలను, సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. నేటి వరకు, దక్షిణ కన్నడలోని 18 కేంద్రాలలో మాస్కులు, శానిటైజర్లు, పరిశుభ్రత మెటీరియళ్లను కూడా అందుబాటులో ఉంచారు.
ప్రచార కార్యక్రమాలు జరుగుతుండగా, ఎన్నో విజయగాథలు బయటికి వచ్చాయి. కొవిడ్ వ్యాక్సిన్ గురించి ఉన్న మూఢనమ్మకాలను పారద్రోలేలా ఈ గాథలు ఉన్నాయి. అమృత్‌సర్‌లోని బల్లార్వాల్ గ్రామానికి చెందిన జస్కరన్, ఆమె కుటుంబం కథ కూడా అలాంటిదే. వ్యాక్సిన్ తీసుకోవద్దని, ప్రచార బృందాలతో మాట్లాడవద్దని జస్కరన్ కమ్యూనిటీలో ఆమెను ఒత్తిడి చేశారు. కానీ జస్కరన్ వారి మాటను కాదని, వ్యాక్సిన్ తీసుకుంది. ఆ తర్వాత ఆ కమ్యూనిటీ వాళ్లందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం నిజంగా గర్వకారణం.
ఒకరిద్దరు ముందుకొస్తే మొత్తం కమ్యూనిటీ మారుతుందని చెప్పడానికి మరొక ఉదాహరణ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన విజయ రాణి ఒక ఆశా వర్కర్. ఆమెకు 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. Sanjeevani బృందంతో కలిసి ఆమె సంజీవని గాఢీలో తిరుగుతూ ప్రచారం చేస్తూ ఎంతోమందికి వ్యాక్సిన్ గురించి అవగాహన కలిగేలా చేసింది. అంతేకాకుండా పక్క ఊర్లలో ఉన్న ఆశా వర్కర్లకు కూడా ఆమె చేస్తున్న పని గురించి చెప్పి, వారిని కూడా సహాయం చేయడానికి ముందుకు నడిపి, అవగాహన కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు దోహదపడింది.
తర్వాతి కార్యక్రమాల్లో భాగంగా, ఇప్పటికే ఎంతో మంది స్థానికులు ఈ ప్రచారానికి మద్దతు పలుకుతున్నారు కాబట్టి, తీవ్రంగా విస్తరిస్తున్న మహమ్మారిని అరికట్టడానికి అందరూ చేతులు కలపాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందేలా చేయడానికి ప్రచార బృందం ప్రయత్నిస్తోంది. రానున్న థర్డ్ వేవ్ తాకిడిని తట్టుకునేందుకు అందరినీ సిద్ధం చేయాలని చూస్తోంది. ఆ క్రమంలో జిల్లాల్లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ చేరేలా ఎక్కువ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకుంది.
డా. శైలేష్ వాగ్లే, మేనేజర్,
కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్, United Way Mumbai
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.