‘మాకు బహుమతులొద్దు.. రైతుల కోసం విరాళాలివ్వండి’ అంటున్న కొత్త జంట.. నెటిజన్ల ప్రశంసలు

విరాళాల కోసం ఏర్పాటు చేసిన బాక్స్

Donate For Farmers: తమకు అన్నం పెట్టే రైతులు పోరాడుతుంటే తాము మాత్రం సంతోషంగా ఎలా ఉంటామనుకున్నారో.. ఏమో గానీ.. పంజాబ్ కు చెందిన ఒక నూతన జంట వినూత్నంగా ఆలోచించింది. తమ వంతు సాయం చేయాలని నిశ్చయించుకున్నది.

 • News18
 • Last Updated :
 • Share this:
  దేశ రాజధానిలో ఎముకలు కొరికే చలిలో సైతం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతాంగం అలుపెరగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి వివిధ రంగాల నుంచి మద్దతు కూడా భారీగా పెరుగుతున్నది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. అయితే వారిలో పలువురు రైతుల కోసం ఆహారం, బట్టలు, స్వెటర్లు, రగ్గులు కొనిస్తున్నారు. వారికి ఏలోటు రాకుండా చూసుకుంటున్నారు. కాగా, తమకు అన్నం పెట్టే రైతులు పోరాడుతుంటే తాము మాత్రం సంతోషంగా ఎలా ఉంటామనుకున్నారో.. ఏమో గానీ.. పంజాబ్ కు చెందిన ఒక నూతన జంట వినూత్నంగా ఆలోచించింది. తమ వంతు సాయం చేయాలని నిశ్చయించుకున్నది.

  వివరాల్లోకెళ్తే... సాధారణంగా పెళ్లికి వెళ్తే వధూవరులను ఆశీర్వదించడానికి వారికి నగదు, బంగారం, నగలు గానీ.. లేదంటే ఏదైనా బహుమతులు గానీ ఇస్తారు. కానీ పంజాబ్ లోని ముక్త్సర్ పట్టణానికి చెందిన ఒక జంట మాత్రం అందుకు వినూత్నంగా ఆలోచించారు. తాము రైతులకు మద్దతుగా నిలవాలనుకుని.. పెళ్లికి వచ్చే వాళ్లు తమకు బహుమతులు తీసుకురావద్దని చెప్పారు. తమ కోసం తీసుకొచ్చేదేదైనా ఉంటే.. దానిని రైతుల కోసం అందజేయాలని అనుకున్నారు. అందుకోసం ఏకంగా ఒక బాక్స్ ను కూడా ఏర్పాటు చేశారు.

  తమకు బహుమతులు ఇచ్చేవారు.. నగదు రూపంలో గానీ, మరే ఇతర రూపంలో గానీ.. దానిని తీసుకొచ్చి ఆ డబ్బాలో వేయాలని అతిథులకు తెలిపారు. ఆ డబ్బా అమ్మగా వచ్చిన డబ్బుతో రైతులకు ఆహారం, దుస్తులు కొని అందిస్తామని వారు తెలిపారు. తమకు బహుమతులు వద్దని.. రైతులకు సంఘీబావంగా విరాళాలు అందజేయాలని ఆ జంట తెలపడం గమనార్హం. ఈ జంటకు సోషల్ మీడియా లో ప్రశంసలు దక్కుతున్నాయి. రైతులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకొస్తుండటం ఆశాజనకమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

  కాగా.. దేశ రాజధానిలో సుమారు పదిహేను రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమం రాను రాను ఉధృతం అవుతున్నది. కేంద్రం తీసుకొచ్చిన మూడు అగ్రి చట్టాలు.. రైతులకు వ్యతిరేకమని.. వాటితో కార్పొరేట్లకు తప్ప తమకు ఒరిగేదేమీ లేదని ఆరోపిస్తున్నారు. వాటిని రద్దు చేసే దాకా తాము రణం ఆపబోమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఆ చట్టాల రద్దు కుదరదని... వాటికి సవరణలు మాత్రమే చేస్తామని తేల్చి చెప్పింది. దీనికి రైతులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఆ చట్టాల రద్దును మాత్రమే తాము కోరుతున్నామని.. సవరణలు తమకు అక్కర్లేదని రోడ్లపైనే బైటాయించారు.
  Published by:Srinivas Munigala
  First published: