కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా హాట్ హాట్‌గా జరుగుతోంది. ఈ చట్టాలపై రాజకీయ దుమారం కూడా కొనసాగుతోంది. ఢిల్లీ శివారులో వేలాది మంది రైతులు 25 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఐతే ఈ ఆందోళనల వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని.. విపక్షాల ఉచ్చులో పడవొద్దని రైతులకు ప్రభుత్వం సూచిస్తోంది. అంతేకాదు రైతుల ఆందోళలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అసలు కొత్త చట్టాలపై క్షేత్రస్థాయిలో రైతులు ఏమనుకుంటున్నారు? కొత్త చట్టాలను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని న్యూస్ 18 తెలుసుకునే ప్రయత్నం చేసింది.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 2412 మంది ఓపీనియన్ సర్వేలో పాల్గొన్నారు. రైతులు, సాధారణ ప్రజలతో న్యూస్ 18 రిపోర్టర్లు మాట్లాడారు. వారికి 12 ప్రశ్నలు సంధించి సమాధానాలు తెలుసుకున్నారు. మరి వారు ఏమన్నారో ఇక్కడ చూడండి.
1. మీరు వ్యవసాయరంగంలో సంస్కరణలు, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడాన్ని సమర్థిస్తారా?
సర్వేలో పాల్గొన్న వారిలో 73.05 శాతం మంది వ్యవసాయరంగంలో సంస్కరణలను సమర్థించారు.
2. భారత వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు, రైతుకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం తెచ్చిన చట్టాలకు మద్దతు తెలుపుతారా?
53.6 శాతం మంది కొత్త వ్యవసాయ చట్టాలను సమర్థించారు. 30.6 శాతం మంది సమర్థించలేదు. 15.8 శాతం మంది చెప్పలేం అన్నారు.
3. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మండీలకు బయట తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు లభించిందన్న విషయం మీకు తెలుసా?
అవును. కొత్త చట్టాల ద్వారా రైతులకు ఎన్నో అవకాశాలు లభిస్తాయని మెజారిటీ మంది అభిప్రాయపడ్డారు.
4. మండీల బయట తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులకు అవకాశం కల్పించడాన్ని మీరు సమర్థిస్తారా?
69.65 శాతం మంది దీన్ని సమర్థించారు.
5. కొత్త చట్టాల ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని మీరు భావిస్తున్నారా?
కొత్త చట్టాల ద్వారా రైతు ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని 60.90 శాతం మంది తెలిపారు.
6. వరి, గోధుమ సహా 20కి పైగా పంట ఉత్పత్తులకు మద్దతు ధర యథాతధంగా కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విషయం మీకు తెలుసా?
ప్రధాని మోదీ హామీ ఇచ్చిన విషయం తెలుసని కొంత మంది చెప్పగా.. మరికొంత మంది తెలియదని పేర్కొన్నారు.
7. కనీస మద్దతు ధర వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇస్తే, దానిని మీరు సమర్థిస్తారా?
ప్రభుత్వం ఇచ్చే రాతపూర్వక హామీని 53.94 శాతం మంది సమర్థించారు.
8. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ బయట ఆందోళన చేస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు? మరే ఇతర ప్రతిపాదనలకు ఒప్పుకోమని అంటున్నారు? దీన్ని మీరు సమర్థిస్తారా?
52.69 శాతం మంది దీన్ని సమర్థించలేదు. రైతులు రాజీకి రావాలని సూచిస్తున్నారు.
9. ఢిల్లీలో కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నిషేధిస్తూ.. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా?
66.71 శాతం మంది దీనిని వ్యతిరేకించారు.
10. ప్రస్తుత విపక్ష పార్టీలు గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యవసాయ చట్టాలనే సమర్థించాయన్న విషయం మీకు తెలుసా?
ఈ విషయం తమకు తెలియదని చాలా మంది అభిప్రాయపడ్డారు.
11. ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు రాజకీయంగా ప్రేరేపించబడినవని మీరు భావిస్తున్నారు?
అవును. రైతుల ఆందోళనల వెనక రాజకీయ శక్తులు ఉన్నాయని 48.71 శాతం మంది అభిప్రాయపడ్డారు. 32.59 శాతం మంది అలా జరగలేదన్నారు. 18.70 శాతం మంది కచ్చితంగా చెప్పలేమన్నారు.
12. ఆందోళనలను విరమించే సమయం వచ్చిందని మీరు భావిస్తున్నారా?
సర్వేల్లో పాల్గొన్నవారిలో 56.59 శాతం మంది ఆందోళనలు విరమించేందుకు సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.