హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Narendra Modi: ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు

Narendra Modi: ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

Narendra Modi: వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. అందులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారని వివరించారు.

  కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసమే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని.. కానీ రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకుంటున్నామని ప్రధాని మోదీ చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారని వివరించారు. శుక్రవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాల రద్దుపై కీలక ప్రకటన చేశారు ప్రధాని.

  ''రైతుల మేలు కోసమే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాం. వారి ఉత్పత్తులకు మెరుగైన మద్దతు ధర లభిస్తుందన్న ఉద్దేశంతోనూ వాటిని రూపొందించాం. దేశంలో ఉన్న ప్రతి రైతూ, రైతు సంఘమూ దానిని ఆహ్వానించాయి. వారందరికీ ధన్యవాదాలు. మేం ఏం చేసినా రైతుల కోసమే చేశాం. కానీ కొత్త చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించడంలో మేం విఫలమయ్యాం. కొత్త చట్టాల వల్ల కలిగే ప్రయోజనాల గురించే రైతులకు అన్ని రకాలుగా వివరించాం. రైతులతో ఎన్నో సార్లు చర్చించాం. వారిని ఒప్పించేందుకు ప్రయత్నించాం. గత రెండేళ్లలో ఎన్నో జరిగాయి. రైతులకు కలిగిన ఇబ్బందులకు గాను నేను క్షమాపణ చెబుతున్నా. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. ఈ శీతకాల సమావేశాల్లోనే దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. గురునానక్ ప్రకాశ్ పూరబ్ సందర్భంగా మీ అందరికీ నా విజ్ఞప్తి. ఆందోళన చేస్తున్న వారంతా తిరిగి ఇళ్లకు వెళ్లి కుటుంబాలతో గడపండి. పొలాల్లోకి దిగి తిరిగి వ్యవసాయ పనులను ప్రారంభించండి.'' అని ప్రధాని మోదీ తెలిపారు.

  AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు

  కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీకి చెందిన రైతులు ఢిల్లీ శివారులో శిబిరాలను ఏర్పాటు చేసుకొని నిరసనలను కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినా అప్పట్లో కేంద్రం స్పందించలేదు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. కానీ ప్రధాని మోదీ అనూహ్యంగా ఇవాళ జాతినుద్దేశించి ప్రసగించి.. సంచలన ప్రకటన చేశారు. మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారనగానే దేని గురించి మాట్లాడతారోనని ఆసక్తి ఉన్నా.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. కేంద్రం ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైతులపై ప్రేమతో ఈ నిర్ణయం తీసుకోలేదని.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Farmer, Narendra modi, New Agriculture Acts

  ఉత్తమ కథలు