కొత్తగా తెచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలపై రైతులతో చర్చించేందకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తెలిపారు. వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా తిరోగమన చర్యలు చేపట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. FICCI 93వ వార్షిక సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.."వ్యవసాయ రంగం ఒక్కటే మహమ్మారి ప్రభావానికి లోనుకాలేదు. అంతేకాకుండా మంచి ఉత్పత్తులను సాధించగలిగింది. మా ఉత్పత్తులు, సేకరణ పుష్కలంగా ఉన్నాయి. గిడ్డంకులు కూడా పూర్తిగా నిండిపోయాయి. వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా తిరోగమన చర్యలు తీసుకునే ప్రసక్తే లేదు. దేశంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే వ్యవసాయ సంస్కరణ చట్టాలను తీసుకొచ్చాం. అయినప్పటికీ రైతు సోదరులు మాటలు వినడానికి, వారి అపోహలను తొలగించడానికి మేము ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నాం. అలాగే వారికి ఇవ్వగలిగిన హామీ ఇచ్చేందుకు కూడా సిద్దంగానే ఉన్నాం"అని తెలిపారు.
ఇంకా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చైనాకు వ్యతిరేకంగా భారత సైనికులు ప్రదర్శించిన వీరత్వాన్ని ప్రశంసించారు. ప్రపంచం కరోనాతో పోరాడుతున్న సమయంలో మన భద్రతా బలగాలు మన సరిహద్దులను ధైర్యంగా రక్షించాయని ఆయన గుర్తుచేశారు. ఈ కష్ట సమయాల్లో కూడా వారు దేశం కోసం పోరాడరని కొనియాడారు. సరిహద్దుల్లో చైనాకు మన బలగాలు ధీటుగా బదులిచ్చాయని అన్నారు. ఈ ఏడాది మన బలగాలు సాధించిన విజయాలను చూసి భవిష్యత్తు తరాలు గర్వపడతాయని చెప్పారు.
మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత 19 రోజులుగా రైతులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి భారీగా చేరుకున్న రైతులు అక్కడే తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు కల్పించే విధానాన్ని నిర్వీర్యం చేసేలా కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలు ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 8న భారత్ బంద్ కూడా చేపట్టారు. పోరాటాన్ని మరింత ఉదృతం చేసేలా రైతు సంఘాల నేతలు నేడు నిరహార దీక్షకు దిగారు. ఈ చట్టాలను రద్దు చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు చెబుతున్నారు. ఇక, రైతులతో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. ఈ క్రమంలోనే రైతుల చేత ఆందోళన విరమింప చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, New Agriculture Acts, Rajnath Singh