#Network18PublicSentiMeter | సినిమాలు, షికార్లు, పార్టీలు, ప్రయాణాలపై సర్వే...

ప్రతీకాత్మక చిత్రం

#Network18PublicSentiMeter | తెలుగు సహా 13 భాషల్లో నెట్ వర్క్ 18 సర్వే నిర్వహించింది. మే 21 నుంచి 28వ తేదీ వరకు చేపట్టిన ఈ పోల్‌లో ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

 • Share this:
  లాక్ డౌన్ సమయంలో, లాక్ డౌన్ ముగిసిన తర్వాత ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు? వారి ఆహారపు అలవాట్లు, ప్రయాణాలు, పార్టీలు, ఇతర అంశాలపై నెట్ వర్క్ 18 సర్వే నిర్వహించింది. నెట్ వర్క్ 18 గ్రూప్‌లోని న్యూస్ 18, మనీకంట్రోల్, ఫస్ట్ పోస్ట్, సీఎన్‌బీసీ టీవీ 18‌కు సంబంధించిన డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్ ఫాంల మీద ఈ సర్వే చేపట్టింది. తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో నెట్ వర్క్ 18 సర్వే నిర్వహించింది. మే 21 నుంచి 28వ తేదీ వరకు చేపట్టిన ఈ పోల్‌లో ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మొత్తం 50వేల మందికిపైగా నెటిజన్లు నెట్ వర్క్ 18 సర్వేలో పాల్గొన్నారు. అందులో కొన్ని హైలైట్ పాయింట్లు.

  విమానాలు/ రైలు ప్రయాణాలు చేయడానికి మెజారిటీ సభ్యులు విముఖత వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో 79 శాతం మంది ఫ్లైట్ లేదా రైలు ఎక్కడానికి ఆసక్తి చూపలేదు. కేరళలో వీరి శాతం 39గా ఉంది.

  అసలు సినిమా హాళ్ల వైపు చూసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. మెజారిటీ తెలుగు వారితో పాటు గుజరాతీలు, అస్సామీలు, ఒడియా జనం కూడా ధియేటర్ల ముఖం చూడడానికి ఇష్టపడడం లేదు.

  13 భాషల్లో నిర్వహించిన సర్వేలో ఒక్క గుజరాతీ వారు తప్ప మిగిలిన వారు అంతా ఇంటి దగ్గరే వండుకుని తినడానికి ఆసక్తిగా ఉన్నారు. 49 శాతం మంది గుజరాతీలు బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడానికి రెడీగా ఉన్నారు.

  ఇకపై ఎవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వబోమని 74 శాతం మంది నెటిజన్లు చెప్పారు. అయితే, విచిత్రంగా పంజాబ్‌లో మాత్రం 92 శాతం మంది మాత్రం ఏమో చెప్పలేం అనే సమాధానం ఇచ్చారు.

  మెజారిటీ సభ్యులు తమ ఫేవరెట్ కోవిడ్ వారియర్లుగా డాక్టర్లు, నర్సులను ఎంచుకున్నారు. ఆ తర్వాత స్థానం పారిశుధ్య కార్మికులది. మూడో స్థానంలో పోలీసులు నిలిచారు.

  కొన్నాళ్ల పాటు టూర్లు వాయిదా వేసుకుంటామని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ, గుజరాతీలు (53శాతం), తమిళులు (52 శాతం) టూర్లకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు.

  బాబోయ్ పార్టీలా? మా వల్ల కాదు. మేం రాం. మేం ఇవ్వబోం అని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. ఒక్క తమిళులు మినహా. సర్వేలో పాల్గొన్న తమిళుల్లో చిన్న చిన్న పార్టీలకు వెళ్లడానికి, ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు.

  తామంతా సహజంగానే దయాగుణం కలవారిమని, కరోనా వైరస్ తమను పెద్దగా మార్చిందేమీ లేదని అన్ని భాషల వారూ ముక్తకంఠంతో స్పష్టం చేశారు.

  లాక్ డౌన్ సమయంలోనే కాదు, లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా తాము ఇంట్లో పనులు చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. ఇంటి పని చేయడంలో కన్నడ (88శాతం), ఒడియా ( 87శాతం ) వారు బాగా ఉత్సాహంగా ఉన్నారు.

  అన్ని భాషలకు చెందిన నెటిజన్లు (సర్వేలో పాల్గొన్నవారు) లాక్ డౌన్ ముగిసిన తర్వాత ప్రైవేటు వాహనాల్లో మాత్రమే ప్రయాణించేందుకు ఆసక్తి చూపారు. కేవలం బెంగాలీలు, తమిళులు, కొందరు ఉర్దూ నెటిజన్లు మాత్రమే అత్యధికంగా ప్రజా రవాణాను వినియోగించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: