Subhas Chandra Bose: నేతాజీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణించారు? 75 ఏళ్ల మిస్టరీ

సుభాష్ చంద్రబోస్ చిత్రం

Netaji Subhas Chandra Bose birth anniversary: గుమ్నామి బాబా అనే సాధువు అయోధ్య దగ్గర్లోని ఫైజాబాద్‌లో 1960 నుంచి 1987 వరకు నివసించారు. ఆయనే నేతాజీ అని, చనిపోయేవరకు అజ్ఞాతంలో గడిపారని మరికొంతమంది భావిస్తున్నారు

  • Share this:
Subhas Chandra Bose Birth Anniversary: భారత స్వాత్రంత్ర సమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్‌ ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయారనే విషయం ఇంకా ఒక మిస్టరీలాగే మిగిలిపోయింది. తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన చనిపోయాడని చాలామంది చరిత్రకారులు నమ్ముతున్నారు. కానీ ఈ సంఘటన జరిగిన 75 సంవత్సరాల తరువాత కూడా నేతాజీ మరణం గురించి అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన ఎలా చనిపోయారో గుర్తించాలని అప్పట్లో నియమించిన జస్టిస్ ఎం.కె. ముఖర్జీ ఏక సభ్య కమిషన్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, కానీ ఆయన ఎలా చనిపోయారో గుర్తించలేకపోతున్నామని ఈ కమిషన్ తేల్చింది. నేతాజీ మనుమడు సూర్య కుమార్ బోస్ జస్టిస్ ముఖర్జీ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలోనే నేతాజీ మరణించారని ఆయన చెబుతున్నారు. గత సంవత్సరం గుమ్నామి బాబా అనే సాధువుపై తీసిన బెంగాలీ సినిమా విడుదలైన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గుమ్నామి బాబా ఎవరు?
గుమ్నామి బాబా అనే సాధువు అయోధ్య దగ్గర్లోని ఫైజాబాద్‌లో 1960 నుంచి 1987 వరకు నివసించారు. ఆయనే నేతాజీ అని, చనిపోయేవరకు అజ్ఞాతంలో గడిపారని మరికొంతమంది భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం గుమ్నామి బాబా ఎవరో తెలుసుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినప్పటికీ, పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు. మరోవైపు ఈ విషయంపై ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించిన వివరాలు నేతాజీ అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. అప్పట్లో ఐబి డైరెక్టర్‌గా పనిచేసిన బీఎన్.మల్లిక్ నెహ్రూకు సన్నిహితుడు. నెహ్రూ హయాంలో ఆయన రెండు దశాబ్దాలు ఉన్నత హోదాలో పనిచేశారు. నెహ్రూకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే వివిధ ప్రాంతాల్లో సాధువులను ఏర్పాటు చేయించి, వారినే నేతాజీగా గుర్తించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వినిపించాయి.

రాజకీయ కారణాల వల్లేనా?
అప్పట్లో నేతాజీ రష్యాలో అజ్ఞాతంలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఆయన భారత్‌కు వస్తే దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని చాలామంది భయపడ్డారు. అలాంటి సందర్భం నిజంగానే వస్తే, గుమ్నామి బాబా వంటి వారు తామే నిజమైన నేతాజీలమని చెప్పుకొని, సుభాష్‌చంద్రబోస్ ప్రభావాన్ని తగ్గించవచ్చని అధికారులు కుట్ర పన్నారు. వివిధ ప్రాంతాల్లో ఇలా ఏర్పాటు చేసిన బాబాల జాబితాలో గుమ్నామి బాబా బాగా ప్రాచుర్యం పొందారు.

విమాన ప్రమాదంలో చనిపోలేదా?
రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు పైచేయి సాధించడంతో నేతాజీ తప్పించుకున్నాడని దిల్లీకి చెందిన పరిశోధకుడు ఇక్బాల్ చంద్ మల్హోత్రా చెబుతున్నారు. ఆయన తైపీలో విమాన ప్రమాదంలో చనిపోలేదని ఇక్బాల్ తెలిపారు. ఒక జర్మన్ జలాంతర్గామిలో నేతాజీ సింగపూర్ నుంచి వ్లాదివోస్టాక్కు, అక్కడి నుంచి USSRకు చేరుకున్నారని చెప్పారు. రష్యాలో చాలా సంవత్సరాలు గడిపిన భారతీయ పరిశోధకురాలు పురబీ రాయ్ మరో విషయం గురించి చెప్పారు. మాస్కోకు దగ్గర్లో ఉన్న పడోల్స్క్‌లోని GRU ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆర్కైవ్స్‌లో నేతాజీ గురించి ఒక డాక్యుమెంట్లో సమాచారం ఉందని ఆమె తెలిపారు. 1946 అక్టోబర్లో జోసెఫ్ స్టాలిన్, ఆయన అనుచరులతో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో 'సుభాష్ చంద్ర బోస్‌ను ఎక్కడ ఉంచాలి' అని చర్చించినట్లు ఆర్కైవ్స్ రిపోర్టులో ఉందని రాయ్ వెల్లడించారు.

పురబీ రాయ్ చెప్పింది నిజమేనా?
ఈ డాక్యుమెంట్‌ గురించి రష్యన్ మేజర్ జనరల్ అలెక్సాండర్ కోలెస్నికోవ్ పురబీ రాయ్‌కు చెప్పారు. ఆమెకు కూడా రష్యన్ తెలుసు. కానీ ఈ ఆర్కైవ్ రష్యన్ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో రాయ్ ఆ డాక్యుమెంట్ను స్వయంగా చూడలేకపోయారు. 1998లో నేతాజీ మరణంపై ఏర్పాటు చేసిన ఎంకే ముఖర్జీ ఎంక్వైరీ కమిషన్ సాక్ష్యాల కోసం మాస్కోకు వెళ్ళింది. అప్పట్లో ఇస్తాంబుల్‌లో పనిచేస్తున్న మేజర్ కోలెస్నికోవ్, కమిషన్ ముందుకు రాలేదు. దీంతో పురబీ రాయ్‌తో ఆయన చెప్పిన విషయాలను, పరిశోధనలను కమిటీ గుర్తించలేదు. కానీ ఆశ్చర్యకరంగా 2016లో ఇక్బాల్ మల్హోత్రా నిర్మించిన ఒక డాక్యుమెంటరీలో కోలెస్నికోవ్ కనిపించారు. దాంట్లో ఆయన GRU ఆర్కైవ్‌లో దొరికిన డాక్యుమెంట్ గురించి ప్రస్తావించారు. నేతాజీ గురించి స్టాలిన్, అతడి అనుచరులు చర్చించుకున్న విషయం గురించి కోలెస్నికోవ్ చెప్పారు. కానీ ఈ ఆధారాలను భారత ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు.

ఆ డాక్యుమెంట్లలో ఏముంది?
2016లో నేతాజీకి సంబంధించిన కొన్ని డ్యాక్యుమెంట్లు విడుదలయ్యాయి. 1945 డిసెంబర్ 26, 1946 ఫిబ్రవరి మధ్య సుభాస్ చంద్రబోస్ విదేశాలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. తాను తిరిగి వస్తానని, తన చేతుల్లో దేశానికి స్వతంత్రం వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన వాగ్దానం చేసినట్లు అప్పట్లో దొరికిన డాక్యుమెంట్లలో ఉంది. కానీ ఆ తరువాత నేతాజీ గురించి సరైన సమాచారం తెలియలేదు. కానీ డిక్లాసిఫైడ్ ఫైళ్లలో మరో సమాచారం బయటపడింది. బోస్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని వైస్రాయ్ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ ప్రధానిని అడిగిన నోట్ దొరికింది. ఆ తరువాత 1945 అక్టోబర్ 25న అప్పటి బ్రిటిష్ ప్రధాని ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సుభాస్ చంద్రబోస్‌ ప్రస్తుతం ఉన్నచోటున ఉండేందుకు అనుమతించాలని సమావేశంలో నిర్ణయించినట్లు రిపోర్టుల్లో ఉంది.

స్టాలిన్ వాడుకోవాలనుకున్నాడా?
స్టాలిన్ నేతాజీని సజీవంగా ఉంచాడని కొంతమంది చరిత్రకారులు భావించారు. భారత్‌లో బ్రిటీష్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న నెహ్రూ, ఇతర నాయకులను నిరోధించేందుకు స్టాలిన్ సుభాష్ చంద్రబోస్‌ను అస్త్రంగా వాడుకోవాలని భావించి ఉండవచ్చు. కానీ స్టాలిన్ 1953లో చనిపోయాడు. ఆ తరువాత సోవియట్ యూనియన్‌ కొత్త నాయకులు నెహ్రూతో కలిసి నేతాజీని సైబీరియాకు పంపించారని కొంతమంది పరిశీలకులు నమ్ముతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: