ఈ మధ్యకాలంలో తరచూ భారత్‌ను కవ్వించే విధంగా వ్యవహరిస్తున్న నేపాల్... ఈ క్రమంలో మరో దుశ్చర్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని కిషన్ గంజ్ సరిహద్దుల్లో పశువులను కాస్తూ సరిహద్దుల వరకు వెళ్లిన జీతేంద్ర కుమార్ సింగ్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులపై నేపాల్ పోలీసులు కాల్పులకు దిగారు. ఈ విషయాన్ని కిషన్ గంజ్ డీఎస్పీ అన్వర్ జావెద్ ధృవీకరించారు. ఇండో నేపాల్ సరిహద్దుల్లోని ఫతేపూర్‌లోని తెహ్రగచ్లో ఈ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. నేపాల్ పోలీసులు జరిపిన ఈ కాల్పుల్లో జీతేంద్ర సింగ్ చేతులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కాల్పుల నుంచి మిగతా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డ యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై తాము విచారణ చేపట్టామని నేపాల్ అధికారవర్గాలతోనే చర్చలు జరుపుతున్నామని కిషన్ గంజ్ డీఎస్పీ అన్వర్ జావెద్ వెల్లడించారు. అయితే ఈ ఘటనపై స్థానికల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే చైనా కుట్రలకు సహకరిస్తున్న నేపాల్... ఈ మధ్యకాలంలో తరచూ భారత్‌ను కవ్విస్తోంది. భారత్ భూభాగాన్ని తమ దేశంలో కలుపుకుంటూ పార్లమెంట్లో చట్టం చేసిన నేపాల్.. ఇటీవల శ్రీరాముడి విషయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భారతీయుల్లో ఆగ్రహం కలిగేలా చేసింది.