J&K LG: భారత ప్రధాని మోదీ (PM Narendra Modi) ద్వారా భారత విద్యా రంగంలో కీలక మార్పులు సాధ్యమయ్యాయని జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ (Jammu and Kashmir) గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. మంగళవారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 (National Education Policy-2020)కి సంబంధించిన కార్యక్రమాల లాంచింగ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. గాంధీనగర్‌లోని పద్మశ్రీ పద్మ సచ్దేవ్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ భవిష్యత్తు ఇన్నోవేటర్లు, లీడర్లను తయారు చేస్తోందని ఈ సందర్భంగా మనోజ్ సిన్హా అన్నారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ భారత్‌ను నాలెడ్జ్ సూపర్ పవర్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ అవసరమైన వనరులను సమకూర్చుకుంటున్నాయని అన్నారు. ఈ దిద్దుబాటు చర్యలు ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం కావడానికి ఎంతగానో సహాయపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గ్లోబల్‌గా, నేషనల్‌గా వాటి ర్యాంకింగ్‌లు మెరుగుపడతాయన్నారు. ఈ పాలసీ అమలుపై ఓ పుస్తకాన్ని కూడా ఆయన విడుదల చేశారు.
మోదీ నాయకత్వంలోనే విప్లవాత్మక మార్పులు
2022-23 విద్యా సంవత్సరంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చిన సిఫార్సులను యూజీ ప్రోగ్రాంలో ఉన్న అన్ని కళాశాలలు అమలు చేస్తున్నాయని మనోజ్ సిన్హా చెప్పారు. అందువల్ల థియరిటికల్ నాలెడ్జ్‌కి, ప్రాక్టికల్ నాలెడ్జ్‌కి మధ్యన ఉండే ఖాళీ భర్తీ అవుతోందని చెప్పారు. ప్రాక్టికల్ స్కిల్స్ పెరగడం వల్ల పరిశోధన దృష్టి విద్యార్థులలో పెరుగుతుందన్నారు. దీని వల్ల డిగ్రీ ప్రోగ్రాంలలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందని తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(NEP) ద్వారా ఇన్నోవేషన్, క్రియేటివిటీలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో స్థిరమైన సాంకేతిక పురోగతితోనే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. విద్యారంగంలో ఇలాంటి విప్లవాత్మక మార్పులు అన్నీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగాయని ప్రశంసించారు.
అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి
భవిష్యత్తులో ఏవి అవసరమో తెలుసుకుని విద్యార్థులు వాటికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలని జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. విద్యా రంగంలో పరిశోధన అవసరం చాలా ఉందని చెప్పారు. డిగ్రీ కళాశాలలు స్కిల్ డవలప్మెంట్ కోర్సులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్( NSQF) కింద పని చేసే స్కిల్ సెక్టార్ కౌన్సిల్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. వీటికి కళాశాలల ప్రోత్సాహం బాగుందన్నారు. ఇలాంటి కోర్సులు ఇండస్ట్రీల భాగస్వామ్యంతో జరగాలన్నారు.
ఉన్నత చదువుల్లో ఉపాధ్యాయులు స్టార్టప్ ఎకో సిస్టంని ప్రమోట్ చేయాలని చెప్పారు. విద్యార్థుల్లో నిశిత పరిశీలనా దృష్టిని అలవర్చాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఈ ట్రైనింగ్ల్లో భాగంగా కళాశాలలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ ట్రైనింగ్‌కి 12చొప్పున, పరిశ్రమల్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ అయితే 18 చొప్పున క్రెడిట్ స్కోర్లు ఇస్తామన్నారు. ఈ శిక్షణల కోసం ముందు 50 కళాశాలలను గుర్తించామని తెలిపారు.
భవిష్యత్తు లీడర్లుగా ఎదగాలి
ఈ కార్యక్రమంలో ఎల్టీ గవర్నర్ సలహాదారులు రాజీవ్ రాయ్ భట్నాగర్ కూడా మాట్లాడారు. యువత ఉన్న వనరులను ఉపయోగించుకుని భవిష్యత్ లీడర్లుగా ఎదిగే నైపుణ్యాలను సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు. జమ్ము కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ అరుణ్ కుమార్ మెహతా మాట్లాడుతూ ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కాన్సల్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. జమ్ము కాశ్మీర్‌కి సంబంధించిన ప్రధాన కళాశాలలు, యూనివర్సిటీల ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.