Home /News /national /

NEET JEE ROW LIVE LACK OF TRANSPORTATION COVID RISK WORRY STUDENTS CONGRESS TO HOLD NATIONWIDE PROTESTS TOMORROW SK

NEET, JEE ఇప్పుడే వద్దు.. దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ

NEET, JEE పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్‌తో పాటు ఆమాద్మీ, బీజేడీ, డీఎంకే, టీఎంసీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

    NEET, JEE పరీక్షలపై దుమారం కొనసాగుతోంది. పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని కేంద్రం స్పష్టం చేయగా.. విపక్షాలు మాత్రం ఇప్పుడే వద్దంటున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండడం, రవాణా సదుపాయం లేకపోవడంతో.. నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ పరీక్షలను నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో JEE, NEET పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆందోళనల్లో పాల్గొనాలని కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులను సోనియా గాంధీ కోరారు.

    కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వర్చువల్ మీటింగ్ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు సోనియా. NEET, JEE పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్‌తో పాటు ఆమాద్మీ, బీజేడీ, డీఎంకే, టీఎంసీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్నారు. పరీక్షలను వాయిదా వేసుకుంటూ పోతే విద్యార్థులు ఎంతో నష్టపోతారని... కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారని కర్నాటక సీఎం యడియూరప్ప తెలిపారు. పరీక్షలను ఇప్పుడే వద్దని విపక్షలు అంటున్నప్పటికీ.. యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్‌, నీట్‌ యూజీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.


    కాగా, షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు JEE మెయిన్స్, సెప్టెంబర్ 13న NEET పరీక్షలను నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంపుతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్ కేంద్రాలను 2546 నుంచి 3843కి పెంచారు. షిఫ్ట్‌ల సంఖ్యను కూడా 8 నుంచి 12 పెంచి.. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే వారి సంఖ్యను తగ్గించారు. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యను 1.32 లక్షల నుంచి 85వేలకు తగ్గించారు. కాగా, దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు 8.58 లక్షల మంది విద్యార్థులు, నీట్‌కు 15.97 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, JEE Main 2020, NEET 2020, Sonia Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు