మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో మెట్ల బావి(Step Well) కూలి 13 మంది చనిపోయారు. వీరిలో 10 మహిళలు ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరు పరిస్థితి విషమించి చనిపోయారు. ఇప్పటివరకు 19 మందిని రక్షించారు. బావిలో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించడానికి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) జరుగుతోంది. బావి ఉన్న స్థలం ఇరుకైనదని.. అందువల్ల రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు. కూలిపోయిన బావి కనీసం 50-60 అడుగుల లోతులో ఉంది. నీటితో నిండి ఉంది. రామ నవమి(Sri RAm Navami) సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు అనేక మంది ప్రజలు ఆలయం వద్ద గుమిగూడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆలయంలో ఉన్న పురాతన మెట్లబావి దగ్గరకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 25 మంది లోపల పడిపోయారు. ఈ ఆలయం, మెట్ల బావి సుమారు 60 సంవత్సరాల క్రితం నాటివిగా చెబుతారు. మెట్ల బావి పైన నిర్మించిన డాబాపై దాదాపు 20 నుంచి 25 మంది వరకు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై అధిక బరువు కారణంగా పైకప్పు పడిపోయిందని వారు తెలిపారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఇతర శాఖల అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అనేక మందిని బావి నుంచి బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. మరికొన్ని మృతదేహాలను కూడా వెలికితీశారు. బావిలో ఎంతమంది చనిపోయారనే విషయంపై స్పష్టత లేకపోవడంతో.. బావిలో ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. సహాయక చర్యలు పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Covid 19 : ఒక్కరోజులో 3వేలకు పైగా కేసులు.. భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం
ఇదిలా ఉండగా ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు. ఘటనలో మరణించిన వారి బంధువులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఇస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indore, Madhya pradesh