ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మల్లెపువ్వులా తెల్లగా.. దూదిలా సుతిమెత్తగా ఉండే.. ఇడ్లీ (Idli)లను చాలా మంది ఇష్టంగా తింటారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా లాగిస్తుంటారు. ముఖ్యంగా సౌత్ ఇండియా ఇది ఫేమస్ టిఫిన్ ఐటమ్. ఐతే మనకు తెలిసిన ఇడ్లీలు తెల్లగా ఉంటాయి. రాగి ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, పాలక్ ఇడ్లీలు కూడా అప్పుడప్పుడూ మార్కెట్లో కనిపిస్తుంటాయి. తెలుపు రంగులో కాకుండా ఆరెంజ్, బ్రౌన్, గ్రీన్ కలర్‌లోనూ తయారు చేస్తున్నారు.కానీ బ్లాక్ ఇడ్లీ (Black Idli)ని ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? బొగ్గులా నల్లగా ఉంటుందీ ఇడ్లీ. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇది బాగా పాపులర్ అవుతోంది. ఈ వెరైటీ ఇడ్లీని తినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఏపీకి చెందిన కుమార్ రెడ్డి (Kumar Reddy) కుటుంబం నాగ్‌పూర్ (Nagpur)లో సెటిలయింది. అతడు పుట్టింది ఆంధ్రా అయినా.. మహారాష్ట్రలోనే పెరిగాడు. దక్షిణ భారత వంటకాలను చేయడంలలో ఈయనన దిట్ట. సాధారణంగా ఇడ్లీ సాంబార్, దోశ, ఊతప్పం.. ఈ దక్షిణాది వంటకాలు దేశవ్యాప్తంగా చాలా ఫేమస్. కానీ కుమార్ రెడ్డి మాత్రం ఇడ్లీ తయారీలో ఎక్స్పర్ట్. ఇడ్లీల్లో ఎన్నో వెరైటీలు చేస్తారు. కారంపొడి ఇడ్లీ, కార్న్ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, చీజ్ ఇడ్లీ, చాక్లెట్ ఇడ్లీ, పిజా ఇడ్లీ, ఇడ్లీ ఫ్రై.. ఇలా ఒక్కటా రెండా.. దాదాపు 40 రకాల ఇడ్లీలను తయారుచేస్తున్నాడు కుమార్ రెడ్డి. ఐతే ఇలాంటివి చాలా చోట్ల దొరుకుతున్నాయని.. ఇంకేదైనా వెరైటీగా చేయాలని ఫ్రెండ్ సూచించాడు. అప్పుడు బ్లాక్ ఇడ్లీ ఐడియా వచ్చింది. ఆ తర్వాత సంప్రదాయ పద్దతిలో ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయకుండా.. బ్లాక్ ఇడ్లీలను తయారు చేస్తున్నాడు.
ఫుడ్ బ్లాగర్స్ వివేక్, అయేషా ఈ బ్లాక్ ఇడ్లీని వీడియో తీసి ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వీటి తయారీ కూడా సాధారణ ఇడ్లీలానే ఉంటుంది. నలుపు, బూడిద రంగులో ఉండే ఇడ్లీ పిండిని స్టీమర్ పేట్లో వేసి, స్టీమర్లో ఉంచుతారు. కాసేపటి తర్వాత స్టీమర్ నుంచి ఇడ్లీలను బయటకు తీసి వేడి వేడిగా వడ్డిస్తారు. ఓ ప్లేట్లో ఇడ్లీలు వేసి పై నుంచి కాస్త నెయ్యిని పోస్తారు. దానిపై కొంచెం కారం పొడి చల్లి... అనంతరం మళ్లీ కాస్త నెయ్యి వేస్తారు. చివరగా ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ వేసి వడ్డిస్తున్నారు కుమార్ రెడ్డి.
అసలు ఇడ్లీకి ఈ నలుపు రంగు ఎలా వచ్చింది? అందులో ఏయే పదార్థాలు వేస్తారు? అని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సాధారణ ఇడ్లీ పిండికి బొగ్గు పొడిని కలపడం వల్లే ఇడ్లీకి నలుపు రంగు వస్తుంది. కొబ్బరి చిప్పలు, నారింజ పండ్ల తొక్కలు, బీట్ రూట్ గుజ్జును బాగా ఎండబెడతారు. వాటిని మంటలో వేసి కాల్చకుండా.. బాణలిలో బాగా రోస్ట్ చేస్తారు. నలుపు రంగు వచ్చే వరకు వేయిస్తారు. నల్లగా మారిన తర్వాత బయటకు తీసి.. పొడి చేశారు. ఆ చార్ కోల్ పొడినే ఇడ్లీల్లో కలుపుతారు.
ఐతే ఈ చార్ కోల్ ఇడ్లీనే కొందరు బ్లాగర్స్.. డెటాక్స్ ఇడ్లీగా పిలుస్తున్నారు. దీనిని తింటే శరీరంలోని మలినాలు బయటకు తొలగిపోతాయని చెప్పారు. కుమార్ రెడ్డి మాత్రం తానెప్పుడూ డెటాక్స్ ఇడ్లీ అని చెప్పలేదని పేర్కొన్నారు. కానీ తన దగ్గర టిఫిన్ చేసే కొందరు డైటీషియన్లు ఇది డెటాక్స్లా కూడా పనిచేస్తుందని.. ఆరోగ్యానికి మంచిదని చెప్పినట్లు ఆయన తెలిపారు. త్వరలో ల్యాబ్ టెస్ట్‌కు కూడా పంపిస్తామని వెల్లడించారు కుమార్ రెడ్డి. బ్లాక్ ఇడ్లీ తయారీలలో కొబ్బరి చిప్పలు, నారింజ తొక్కలు, బీట్ రూట్ గుజ్జు వంటి సహజ పదార్థాలనే వినియోగిస్తామని.. అందుకే ఏ సమస్యలూ రావని ఆయన స్పష్టం చేశారు. వీటి వల్ల ఇడ్లీ రుచి కూడా అదిరిపోతుందని చెబుతున్నారు.
ఐతే ఈ బ్లాక్ ఇడ్లీల గురించి నెటిజన్లు...ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వామ్మో ఇలా ఉందేంటి.. మీ క్రియేటివిటీకో దండం అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిసిటీ, వ్యాపారం కోసం వంటకాలపై ప్రయోగాలు చేస్తారా? అని విమర్శిస్తున్నారు. అంతేకాదు ఆ బ్లాక్ ఇడ్లీ అచ్చం గిన్నెలు తోమే స్క్రబ్బర్‌లా ఉందని కొందరు.. సిమెంట్ కాంక్రీట్ ముద్దలా ఉందని మరికొందరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం కుమార్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు. నీ క్రియేటివిటీకి హాట్సాప్ అని ప్రశంసిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.