ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో బొగ్గు గని కూలీలపై భారత ఆర్మీ కాల్పులు జరిపిన ఘటన దేశాన్ని కుదిపేసింది. పార్లమెంట్ లోనూ రచ్చకు దారితీసింది. విభిన్న తీవ్రవాదులకు కేంద్రమైన నాగాలాండ్‌లో ఆర్మీ బలగాలు శనివారం చేపట్టిన తీవ్రవాద నిరోధక ఆపరేషన్‌లో భారీ తప్పిదం జరిగింది. శనివారం రాత్రి నాగాలాండ్‌లోని మోన్ జిల్లా పరిధిలోని ఓటింగ్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు, ఒక సైనికుడు మరణించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్(ఏఎఫ్ఎస్పీఏ) అమలులో ఉన్నందున సైన్యం యధేచ్ఛగా కాల్పులకు పాల్పడిందని విపక్షాలు ఆరోపించడం, ఈ ఘటనలో ప్రభుత్వ వివరణ కోరుతూ ఆందోళనకు దిగడంతో పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం ఏర్పడింది. చివరికి నాగాలాండ్ కాల్పులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వివరణ ఇచ్చారు. తప్పుడు నిర్ధారణ వల్లే కాల్పులు జరిగాయన్న హోం మంత్రి.. నాగాలాండ్ కాల్పుల ఘటనపై సిట్ దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు. అసలు ఓటింగ్ గ్రామంలో ఆరోజు ఏం జరిగిందనే విషయాన్ని అమిత్ షా కూలంకశంగా సభకు వివరించారు..
సైనికులపై తిరుగుబాటు..
నాగాలాండ్ కాల్పుల ఘటనపై లోక్‌సభలో సోమవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. మాన్ జిల్లాలోని ఓటింగ్‌లో తీవ్రవాదుల కదలికలు ఉన్నట్లు ఆర్మీకి సమాచారం వచ్చిందని, ఆ సమయంలో అనుమానాస్పద ప్రాంతంలో సుమారు 21 మంది కమాండోలు ఆపరేషన్‌కు సిద్దమయ్యారని, అయితే అక్కడకు వచ్చిన వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. ఆ వాహనం ఆగకుండా వెళ్లిందన్నారు. దీంతో ఆ వాహనంలో తీవ్రవాదులను తరలిస్తున్నట్లు అనుమానించి ఆర్మీ కాల్పులు జరపాల్సి వచ్చిందని షా తెలిపారు. ఆ వాహనంలో ఉన్న 8 మందిలో 6 మంది కాల్పులకు బలైనట్లు ఆయన చెప్పారు. గాయపడ్డ ఇద్దర్ని సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి ఆర్మీ తరలించిందన్నారు. ఈ ఘటన తర్వాత గ్రామస్తులు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి, రెండు వాహనాలు ధ్వంసం చేశారని, సైనికులపై తిరగబడ్డారని హోంమంత్రి చెప్పారు.
ఆత్మరక్షణ కోసమే కాల్పులు..
గ్రామస్థుల తిరుగుబాటులో ఓ సైనికుడు మృతిచెందినట్లు అమిత్ షా వెల్లడించారు. ఆత్మరక్షణ కోసం సైనికులు ఫైరింగ్ జరిపారన్నారు. కాల్పుల వల్ల మరో ఏడు మంది పౌరులు మృతిచెందినట్లు షా వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. అదుపులోనే ఉందన్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని డిసెంబర్ 5వ తేదీన నాగాలాండ్ డీజీపీ, కమీషనర్ పరిశీలించారని, ఆర్మీ కాల్పుల ఘటనపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామన్నారు. కేసు విచారణ కోసం రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నెల రోజుల్లోనే విచారణను పూర్తి చేయాలని సిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాగాలాండ్ కాల్పుల ఘటనలో చనిపోయినవారి ఒక్కో కుటుంబానికి కేంద్రం రూ.11 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.5లక్షలు నష్టపరిహారం ప్రకటించడం తెలిసిందే. కాగా,
ఆ చట్టాన్ని రద్దు చేయండి..
నాగాలాండ్ కాల్పుల ఘటనపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు నిరసనకు దిగడంతో కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. రాజ్యసభ ప్రారంభంలోనే అమిత్ షా వివరణ ఉంటుందని భావించినా అలా జరక్కపోవడంతో విపక్షాలు వాకౌట్ చేసి, గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశాయి. మధ్యాహ్నం తర్వాత అమిత్ షా ప్రకటన వెలువడింది. కాగా, ఇదే అంశంపై లోక్ సభలో హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. సైనికులకు విశేష అధికారాలు కల్పించే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్(ఏఎఫ్ఎస్పీఏ) చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, ఏ దేశంలోనూ ఇలాంటి రాక్షస చట్టం లేదన్నారు. నాగాలాండ్ కాల్పుల ఘటనలో హంతకులను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు. అణిచివేతకు, ద్వేషానికి అస్సాం రైఫిల్స్ విభాగం కేరాఫ్ గా మారిందని ఆరోపించారు. అసలు అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం ఇచ్చింది చైనా వాళ్లా? అని ఓవైసీ ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Indian Army, Nagaland, Parliament Winter session