కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి విధించిన లాక్డౌన్, అన్ని రంగాలపై ప్రభావం చూపింది. దీని కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా కళనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కళాకారుల పొట్టకొట్టింది మహమ్మారి. కరోనా కారణంగా రోడ్డున పడ్డ వారిలో నారాయణ పొలినోయనా అనే కళాకారుడు కూడా ఒకరు. ఆయన బెంగళూరు వీధుల్లో బసవన్నను (పవిత్ర ఎద్దు లేదా ఆబోతు) తిప్పుతూ నాదస్వరం వాయించే వారు. ఇంటింటికి తిరిగి నాదస్వరం ఊదుతూ బిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునే వారు. అయితే, గల నెల రోజుల నుంచి కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో బెంగళూరులో లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఫలితంగా, నారాయణకు భిక్ష ఇవ్వడానికి ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. దీంతో ఆయన పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఈ క్రమంలో అతడు నాదస్వరం వాయిస్తూ భిక్షాటన చేసిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి చలించిపోయిన తమిళ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ ఆయనకు ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు, ఆయనకు సహాయం చేయమని నెటిజన్లను కోరారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్‌కు జి.వి. ప్రకాశ్ దగ్గరి బంధువు కావడం విశేషం.
కర్ణాటక ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో మెంబర్షిప్..
నారాయణ దయనీయ పరిస్థితి గురించి తెలుసుకున్న న్యూస్ 18 బృందం ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకుంది. న్యూస్ 18 కన్నడ విభాగం, బెంగళూరులోని ఉత్తరాహళ్లిలో నారాయణను కనుగొంది. ఆయన దీన స్థితి వివరిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అనంతరం న్యూస్18 బృందం కర్ణాటక ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరిపి, ఆయనకు అసోసియేషన్ మెంబర్షిప్ వచ్చేలా కృషి చేసింది. తద్వారా, ఇప్పుడు ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటున్నారు.
న్యూస్ 18 కూడా తన వంతుగా ఆయన కుటుంబానికి రెండు నెలల పాటు అవసరమయ్యే రేషన్ కిట్ సరుకులను అందించింది. ఇదిలావుండగా, అద్భుతమైన ప్రతిభ గల నారాయణ పొలినోయనాకు ఉపాధి కల్పించేందుకు తమిళ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ ముందుకొచ్చారు. ఆయనను తన టీంలోకి తీసుకుంటాని, గ్రామీణ జానపద కళాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తానని తెలిపారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.