Lavil Siva Temple: కేరళ(Kerala) కన్నూర్ ప్రాంతంలోని చెంగళాయి పంచాయతీ పరిధిలో తెర్లాయి అనే ద్వీప గ్రామం ఉంది. ఆ ఊరిలో 140పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో మూడు కుటుంబాలు మాత్రమే హిందూ మతానికి చెందినవి. మిగతావన్ని ముస్లిం మతానికి చెందినవి. అయితేనేం ఆ గ్రామ ముస్లింలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. 600ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన శివాలయ పునరుద్దరణకు నడుం బిగించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు.
తెర్లాయి గ్రామంలో లావిల్ శివాలయం ఎంతో పురాతనమైనది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి శిథిలావస్థలో ఉంది. అయినా ఏ అధికారీ పట్టించుకోలేదు. దీంతో రోజువారీ దూపదీప నైవేద్యాలను సమర్పించడానికి తగినంత ఆర్థిక వనరులు లేక ఆలయ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా గ్రామంలో ముస్లిం జనాభా అధికంగా ఉంది. దీంతో ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో ఆలయ నిర్వహణకు ఆర్థిక వనరుల లేమితో ఈ శివాలయం శిథిలావస్థకు చేరింది.
పర్యాటక అభివృద్ధి ప్యాకేజీలో..
ఈ గ్రామంలో నివసించే 140 కుటుంబాలలో మూడు కుటుంబాలే హిందువులవి. మిగిలిన వారంతా ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి చాలా తక్కువగా ఉంది. ఆలయానికి ఆదాయ వనరులు పెరగాలంటే బయటి ప్రాంతం నుంచి భక్తులు సందర్శించాలి. ఇందుకు ఆలయాన్ని ప్రభుత్వం పునరుద్దరించాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు చెంగళాయి పంచాయతీ అధ్యక్షుడు వి ఎం మోహనన్. ఇరికూర్ నియోజకవర్గంలోని పర్యాటక అభివృద్ధి ప్యాకేజీలో ఈ ఆలయాన్ని కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో స్థానిక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(IUML) కూడా శివాలయం పునరుద్ధరణకు ముందుకు వచ్చింది.
ఐయూఎంఎల్ తోడ్పాటు
లావిల్ శివాలయం పునరుద్దరణలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(IUML) పాలుపంచుకుంది. ఆలయానికి వెళ్లే దారి పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దీంతో తెర్లాయి శాఖ ముస్లిం లీగ్ కమిటీ సభ్యులు, అదే గ్రామానికి చెందిన 15 కుటుంబాలకు చెందినవారు కలిసి రోడ్డుకు మరమ్మతులు చేశారు. కొన్ని ముస్లిం కుటుంబాలు రోడ్డు విస్తరణ కోసం తమ భూమిలో కొంత భాగాన్ని కూడా ఇవ్వడం విశేషం.
IUML కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ మునవ్వర్ అలీ షిహాబ్ తంగల్ ఆధ్వర్యంలో ఆలయ పునరుద్ధరణ చేపట్టామని ఇరికూర్ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి మూసంకుట్టి అన్నారు. “ప్రస్తుతం, ఆలయం వెలుపల చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి మేం మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అలాగే ఆలయ పునరుద్ధరణకు కొంత ఆర్థిక సహాయం అందించాలని కూడా నిర్ణయించాం’’ అని తెలిపారు. ఇది సహనానికి సంబంధించినది కాదని, మానవత్వానికి సంబంధించినదని మూసంకుట్టి తెలిపారు.
రూ.25- రూ.30 లక్షలు అవసరం
ఆలయ కార్యనిర్వహణాధికారి వీఎం గిరీష్ మాట్లాడుతూ .. ఆరు వందల ఏళ్ల చరిత్ర ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించాలన్నారు. ఇందు కోసం పర్యాటక ప్రాజెక్టులో చేర్చితే ఆలయ పరిస్థితి మెరుగవుతుందన్నారు. ప్రస్తుతం నిధుల కొరత తీవ్రంగా వేధిస్తుందని.. ఆలయ రూపురేఖలు మార్చడానికి సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఇందుకు ముస్లిం కుటుంబాలు చేయుతనందించడానికి ముందుకు రావడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala, Lord Shiva, Muslim brothers