Home /News /national /

MURDER CASE AGAINST UNION MINISTER SON ASHISH MISHRA IN LAKHIMPUR KHERI VIOLENCE CASE UPDATES HERE MKS

UP Violence:కేంద్ర మంత్రి కొడుకుపై హత్య కేసు -Lakhimpur రోడ్డుపైనే రైతుల మృతదేహాలు -హైటెన్షన్

లఖింపూర్ రోడ్లపై రైతుల మృతదేహాలతో నిరసన

లఖింపూర్ రోడ్లపై రైతుల మృతదేహాలతో నిరసన

Lakhimpur Kheri Violence Updates|రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ జిల్లాలో ఆదివారం జరిగిన హింస తాలూకు హైటెన్షన్ సోమవారం కూడా కొనసాగుతున్నది. ప్రతిపక్షాలవి శవరాజకీయాలంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది..

ఇంకా చదవండి ...
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసిస్తోన్న రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సోమవారం కూడా హైటెన్షన్ కొనసాగుతున్నది. కేంద్ర, రాష్ట్రాలు స్పష్టమైన హామీ ఇచ్చేదాకా కదిలేది లేదంటూ బాధిత కుటుంబాలు మృతదేహాలతో రోడ్డుపైనే బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా స్వగ్రామం, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖీరీ జిల్లాలోని తికునియాలో ఆదివారం అనూహ్య సంఘటనలు జరిగాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులపైకి కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ కారును పోనివ్వడం రక్తపాతానికి దారితీసింది. కారు గుద్దడంతో ఇద్దరు రైతులు చనిపోగా, దానికి నిరసనగా చెలరేగిన అల్లర్లలో మరో ఆరుగురు, మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఏడాది కాలంగా ఉద్యమిస్తోన్న రైతులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, సర్కారుపై పోరుకు సిద్ధమయ్యారు. వారికి ప్రతిపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో..

లఖింపూర్ జిల్లాలో హింస చోటుచేసుకున్న సమయంలో తన కొడుకు అక్కడ లేనేలేడని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వాదిస్తూ వచ్చారు. కానీ ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పోలీసులు మాత్రం మంత్రి కొడుకు ఆశిష్ పై హత్య కేసును నమోదు చేశారు. ఆశిష్ మిశ్రాతోపాటు బీజేపీ కార్యకర్తలయిన మరో 13 మందిపైనా మర్డర్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని లఖింపూర్ కలెక్టర్, ఎస్పీలు నిర్ధారించారు. కాగా,

ఆదివారం నాటి హింసలో ప్రాణాలు కోల్పోయిన రైతుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. అయితే, ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకునేదాకా అంతిమ సంస్కారాలు నిర్వహించబోమంటూ బాధిత కుటుంబాలు భీష్మించాయి. ప్రస్తుతం లఖింపూర్ లోని రోడ్డపైనే వారంతా బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. ఎలాగైనాసరే దహన సంస్కారాలు తొందరగా పూర్తి చేయించేలా ప్రభుత్వాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈలోపే..

లఖింపూర్ హింసలో బలైపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున బయలుదేరారు. కాంగ్రెస్ జాతీయ నేత, యూపీ ఇంచార్జి ప్రియాంక గాంధీ ఆదివారం రాత్రే లఖింపూర్ చేరుకునే ప్రయత్నం చేయగా, ఆమెను పోలీసులు అడ్డుకుని హౌజ్ అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు లఖింపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండం, వారిని పోలీసులు అడ్డుకుంటుండం సాధారణ దృశ్యంగా మారింది..

సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, ప్రగతి శీల్ సమాజ్ వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ లు కాన్వాయ్ లేకుండా బస్సులో ఘటనా స్థలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు గుర్తించి అడ్డుకుని అరెస్టు చేశారు. ఉద్రిక్తతలు పెరగకుండా ప్రస్తుతం లఖింపూర్ జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించిన పోలీసులు.. రాజకీయ నాయకులెవరినీ బాధిత కుటుంబాల వద్దకు వెళ్లనీయడం లేదు. కాగా,

లఖింపూర్ జిల్లాలో రైతులపై హత్యా కాండను నిరసించడానికి ఏకంగా ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ యూపీ వస్తాననడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఒక రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతూ మరో రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఆటంకపర్చడం తగదంటూ భగేల్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. భగేల్ విమానానికి లక్నోలో ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వొద్దని బీజేపీ నేతలు సీఎం యోగిని డిమాండ్ చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటలనపై ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని కమలనాథులు ఫైరవుతున్నారు..
Published by:Madhu Kota
First published:

Tags: Akhilesh Yadav, Bjp, Congress, Farmers Protest, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు