కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలు రద్దు చేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని రైతులు చెబుతున్నారు. సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని వారాలుగా వివిధ రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రైతుల ప్రయోజనాల కోసమే మూడు కొత్త చట్టాలు చేశామని కేంద్రం చెబుతోంది. అవసరమైతే చట్టాల్లో సవరణలు చేస్తాం కానీ, వాటిని రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాల వల్ల రైతులకు లాభం ఎంత? కార్పొరేట్లకు వ్యవసాయాన్ని దారాదత్తం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? తదితర వివరాలను పరిశీలిద్దాం.
కొత్త వ్యవసాయ సంస్కరణల చట్టాల్లో ఏముంది?
ప్రభుత్వం ఇటీవల మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలకు ఆమోదం తెలిపి, వాటిని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేందుకు తీసుకువచ్చిన The Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Act, 2020; ఒప్పంద వ్యవసాయం చేసుకునేందుకు రూపొందించిన, నిత్యావసర వస్తువుల పరిమితిపై చేసిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దళారులకు అవకాశం కల్పించకుండా రైతుల ఆదాయాన్ని వృద్ది చేయాలనే లక్ష్యంతోనే ఈ చట్టాలు చేశామని కేంద్రం ప్రకటించింది.
రైతులకు ఎలా ఉపయోగం?
ఇంతకు ముందు వివిధ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల (APMC) నియమాల ప్రకారం రైతులు పంటలు అమ్ముకునేవారు. వీటిని కొత్త చట్టాలు సడలించాయి. ఇప్పటి నుంచి ప్రభుత్వ మార్కెట్లలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. దీంతోపాటు ఒప్పంద వ్యవసాయానికి సంబంధించిన నియమ, నిబంధనల ద్వారా చట్టబద్దత కల్పించారు. వ్యవసాయ ఉత్పత్తులపై స్టాక్ పరిమితులను తొలగించేందుకు విధానాన్ని రూపొందించారు. పంటలు ఎక్కువగా పండినప్పుడు వ్యాపారులు రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది.
రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?
పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లలోకి వచ్చేందుకు కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయని రైతులు భయపడుతున్నారు. ఇది గుత్తాధిపత్యాన్ని సృష్టించగలదని, ఫలితంగా పంటల ధరలను ఆయా కంపెనీలు తగ్గించడానికి అవకాశం కలుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ కమిటీ (APMC)లతో పోలిస్తే కొత్త చట్టాలు మంచివేనా?
APMC మార్కెట్లను 1960లలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. రైతులకు మెరుగైన మద్దతు ధరలు కల్పించాలనేది వీటి లక్ష్యం. దీని ప్రకారం రైతులు స్థానిక మార్కెట్ యార్డులలోని లైసెన్స్ పొందిన మధ్యవర్తులకు మాత్రమే పంట ఉత్పత్తులను అమ్మాల్సి ఉంటుంది. అంటే.. బహిరంగ మార్కెట్లో కాకుండా, తమకు దగ్గర్లో ఉన్న మార్కెట్ యార్డుల్లోనే రైతులు పంటలు అమ్ముకోవాలి. ఈ పరిమితుల వల్ల రైతులు తమ పంటను బహిరంగ మార్కెట్లలో అమ్ముకునేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతోపాటు కొన్ని దశాబ్దాలుగా ఈ కమిటీల ద్వారానే పంట ఉత్పత్తులు అమ్మాల్సి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ మార్కెట్లే రైతులు తమ ఉత్పత్తులకు సరిపోయే ధరను పొందడానికి అవరోధాలుగా మారాయి. ఏయే సీజన్లో, ఏయే పంటలకు ఎంత ధర పలుకుతుందనేది ప్రభుత్వం చేతుల నుంచి మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లింది. దీంతో దళారులు చెప్పిన ధరకే పంటలను అమ్ముకునే గతి రైతులకు పట్టింది.
ప్రభుత్వ మార్కెట్లు దళారుల చేతుల్లోకి వెళ్లాయని చేప్పేందుకు ఆధారాలు ఉన్నాయా?
APMCలు ప్రధానంగా కమిషన్ ఆధారిత వ్యవస్థ పై ఆధారపడి ఉంటాయి. లైసెన్స్ పొందిన మధ్యవర్తులు మాత్రమే ఈ మార్కెట్లలో రైతుల పంటలను కొనాలి. ఈ మధ్యవర్తుల్లో కమీషన్ ఏజెంట్లు, హోల్‌సేలర్స్, ట్రాన్స్‌పోర్టర్స్, రైల్వే ఏజెంట్లు, స్టోరేజ్ ఏజెంట్లు ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాలు తరువాత ఇవి inter-connected oligopoliesలకు దారితీశాయి. కొన్ని వ్యాపార వర్గాలే మార్కెట్ యార్డులపై ఆధిపత్యం చూపడం మొదలైంది. స్థానిక మార్కెట్లలో వారు చెప్పిందే వేదం అనేంతగా పరిస్థితులు దిగజారాయి. ఇందుకు ఒక ఉదాహరణ సైతం ఉంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఉంది. 2010 డిసెంబరులో... ఈ మార్కెట్ నుంచి జరిగిన వ్యాపారంలో దాదాపు 20శాతం ఒకే ఒక్క దళారీ సంస్థ ద్వారా జరిగిందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చింది. ఇలాంటి సంస్థలన్నీ కలిసి మార్కెట్ యార్డులకు వచ్చే రైతులకు మద్దతు ధర రాకుండా ముందుగానే ప్రణాళిక వేసుకొని వ్యాపారాన్ని పంచుకుంటున్నాయని తేలింది. ఇలాంటి దళారుల వల్ల రైతు అందుకున్న ధరకు, వినియోగదారులు కొనే ధరకు మధ్య తేడా పెరిగిపోతుంది. లాభం మాత్రం ఎప్పుడైనా మధ్యవర్తుల జేబుల్లోకే వెళ్తుంది. ప్రభుత్వ మార్కెట్ యార్డులు కొంతమంది వ్యాపారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లాయని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (National Council of Applied Economic Research) 2012లో వెల్లడించిన నివేదికలో తెలిపింది.
కొత్త వ్యవస్థ దీన్ని ఎలా మారుస్తుంది?
రైతులు ప్రభుత్వ మార్కెట్ యార్డుల్లోనే కాకుండా బహిరంగ మార్కెట్లలో, ఇతర రాష్ట్రాల్లో కూడా పంటలు అమ్ముకునేందుకు కొత్త చట్టం అవకాశం కల్పించింది. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులకు ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడే అమ్ముకునే అవకాశం కలుగుతుంది.
చట్టాలపై రైతులకు ఎందుకు నమ్మకం కలగడంలేదు?
క్రమబద్ధీకరించని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లలోకి పెద్ద సంస్థలు, ప్రైవేటు వ్యాపారులు ప్రవేశిస్తే.. వారితో బేరమాడే శక్తిని కోల్పోతామని రైతులు భయపడుతున్నారు. దీంతోపాటు కొత్త చట్టం ప్రకారం వ్యాపారులు ఎలాంటి ఫీజులూ చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ప్రైవేట్ వ్యాపారులు లావాదేవీలు చేయడం వల్ల సాంప్రదాయ మార్కెట్ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందేమోనని రైతులు భయపడుతున్నారు.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిరసనలకు ఎందుకు మద్దతు ఇస్తున్నాయి?
గత కొన్ని సంవత్సరాలలో చాలా రాజకీయ పార్టీలు ఇలాంటి సంస్కరణలు చేసేందుకు ముందుకు వచ్చాయి. కానీ అందులో రాజకీయ కోణమే ఉందని స్పష్టంగా అర్థమైంది. సాంప్రదాయ APMC మార్కెట్లు కొన్ని రాష్ట్రాలకు ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఉదాహరణకు పంజాబ్‌లో APMCల్లో గోధుమల కొనుగోలుపై ఆరు శాతం ఫీజు (మార్కెట్ ఫీజు, గ్రామీణాభివృద్ధి ఫీజు-మూడు శాతం చొప్పున)ను ప్రభుత్వం వసూలు చేస్తుంది. ధాన్యంపై ఆరు శాతం, బాస్మతి బియ్యంపై 4.25 శాతం ఫీజు ఉంటుంది. పంజాబ్‌లో సుమారు 90 శాతం గోధుమలు, వరి పంటలను ఈ మార్కెట్లలోనే కనీస మద్దతు ధరల (MSPs)కు కొనుగోలు చేస్తారు. అందువల్ల కొత్త చట్టాలతో ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో ప్రభుత్వంతో పాటు మార్కెట్ కమిటీలపై ఆధారపడి వ్యాపారాలు చేసే మధ్యవర్తులు, రైతులపై కూడా దీని ప్రభావం ఉంటుంది.
కనీస మద్దతు ధరపై రైతులు ఎందుకు భయపడుతున్నారు?
కొత్త చట్టాల వల్ల ప్రభుత్వం చివరికి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ఆపేస్తుందేమోనని, ప్రైవేటు వ్యాపారులకే పంటలు అమ్ముకునే రోజులు వస్తాయేమోనని రైతులు భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 23 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ను ప్రతి సంవత్సరం ప్రకటిస్తోంది.
కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్లు ఏంటి?
అన్ని ప్రధాన పంటల ఉత్పత్తులను ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని చట్టప్రకారం హామీ ఉండాలని, అలాంటి హామీ ఇచ్చే చట్టాన్ని కేంద్రం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. దీని ప్రకారం ప్రైవేటు వ్యాపారులు రైతుల పంటలను కనీస మద్దతు ధరకు, లేదా అంతకంటే ఎక్కువకు కొనాలనే నియమం ఉంటుంది. MSPకి తక్కువగా ఉండే ఏదైనా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించేలా చట్టం ఉండాలని రైతులు కోరుతున్నారు.
MSP వల్ల ఎవరికి ఉపయోగం?
వ్యవసాయ ఉత్పత్తులను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దేశ అవసరాలకు సరిపోయే ఉత్పత్తులను ఎఫ్‌సీఐ సేకరించి, నిల్వ చేస్తోంది. దేశవ్యాప్తంగా అతి తక్కువమంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరను పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలు నిరూపిస్తున్నాయి. వరి సాగు చేసే రైతుల్లో 13.5 శాతం, గోధుమలు పండించే రైతుల్లో 16.2 శాతం మంది రైతులు మాత్రమే కనీసమద్దతు ధరను పొందుతున్నారని నేషనల్ శాంపిల్ సర్వే చెబుతోంది.
కనీస మద్దతు ధరపై చట్టాలు చేయలేమా?
కనీస మద్దతు ధరకోసం చేసే చట్టం వల్ల ద్రవ్యోల్బణం ప్రభావితమవుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు... రైతుల వద్ద మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేసే ప్రైవేట్ వ్యాపారి, తన లాభాన్ని చూసుకొని వాటిని వినియోగదారులకు అందించేందుకు ఎక్కువ ధరలను నిర్దేశించాల్సి వస్తుంది. దీంతో పాటు మద్దతు ధరల విధానాన్ని చట్టబద్దం చేస్తే.. బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది పంట ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు బహిరంగ మార్కెట్లో, విదేశాల్లో పంట ఉత్పత్తుల ధరలు మద్దతు ధరలకంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు వ్యాపారులు పంటలను ఎక్కువ ధరలు పెట్టి కొని, తక్కువ లాభాలకు ఎగుమతి చేయలేరు. ఇదే సందర్భంలో దేశీయ మార్కెట్‌లో కూడా ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధరలకు పంటలను కొనడానికి ముందుకు రారు. దీనివల్ల ప్రభుత్వం లేదా ఎఫ్‌సిఐ మాత్రమే మార్కెట్లో పంటలను కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో పాటు ఎక్కువ మద్దతు ధర వచ్చే పంటలనే రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీనివల్ల ప్రజలకు అవసరమయ్యే వివిధ రకాల పంటల సాగు తగ్గిపోతుంది. ఫలితంగా నూనెగింజలు వంటి అనేక ఆహార ఉత్పత్తులను భారతదేశం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
MSPపై నెలకొన్న ప్రతిష్టంభనకు పరిష్కారం లేదా?
సంస్కరణల వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, చట్టాలకు కొన్ని సవరణలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కనీస మద్దతు ధరకు లిఖిత పూర్వక హామీ ఇస్తామని కేంద్ర మంత్రులు సైతం చెప్పారు. రైతులకు మెరుగైన ధర లభిస్తుందని భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ధర-లోటు (price-deficiency) విధానాన్ని అమలు చేస్తే మంచిదని కొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవస్థను మధ్యప్రదేశ్‌లో ప్రయత్నించారు. దీని ప్రకారం.. మార్కెట్ ధరకు, కనీస మద్దతు ధరకు మధ్య ఉండే లోటును ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది.
ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఇతర రాయితీలు ఏంటి?
కాంట్రాక్ట్ వ్యవసాయంలో రైతుల హక్కులను కాపాడేందుకు చట్టపరంగా అదనపు రక్షణ కల్పించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రిజిస్ట్రేషన్ విధానం ద్వారా ప్రైవేటు మార్కెట్లు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే నోటిఫైడ్ మార్కెట్ల మధ్య సమానత్వం తీసుకొస్తామని తెలిపింది. నోటిఫైడ్ మార్కెట్లలో వర్తించే సెస్, సర్వీస్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. కాంట్రాక్ట్-ఫార్మింగ్ చట్టం ప్రకారం అగ్రి బిజినెస్ స్పాన్సర్లు రైతుల భూమిని ఇతరుల పేరుకు ట్రాన్స్‌ఫర్ చేయడం, అమ్మడం, లీజుకు ఇవ్వడం, తనఖా పెట్టడం వంటివి నిషేధించారు. కాంట్రాక్టు వ్యవసాయంలో రైతులు, స్పాన్సర్ల మధ్య ఏర్పడే భేదాభిప్రాయాల కారణంగా రైతుల భూమిని జప్తు చేయలేరని ప్రభుత్వం పేర్కొంది.
పంట వ్యర్థాల దహనంపైన వ్యతిరేకత
పంటల వ్యర్థాలను కాల్చడం వల్ల ఢిల్లీ, NCR పరిసర ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతోందని, అందువల్ల వ్యర్థాలను దహనం చేసే రైతులకు ఒక సంవత్సరం జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అక్టోబర్లో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. వ్యర్థాలను దహనం చేయకుండా ఇతర అవసరాలకు కొనుగోలు చేసేలా చొరవ చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక క్వింటాల్ వ్యర్థాలకు రూ.200 చొప్పున చెల్లించి, వాటిని తరలించాలని రైతులు కోరుతున్నారు. క్వింటాల్‌కు రూ.100 చొప్పున చెల్లించేందుకు ముందుకు రావాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ సమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని తీసుకువస్తామని ప్రభుత్వం తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.