కుక్క కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం...

Maharashtra : కుక్కను కాపాడబోయి... మొత్తం ఫ్యామిలీ అంతా కరెంటు షాకులో చిక్కుకోవడం అత్యంత విషాదకర అంశం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 6, 2019, 1:11 PM IST
కుక్క కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం...
కుటుంబాన్ని కబళించిన మృత్యువు
  • Share this:
పెంచుకుంటున్న కుక్కను కాపాడే క్రమంలో... తల్లీ, కొడుకూ చనిపోయిన ఘటన మహారాష్ట్రలోని వార్ధాలో జరిగింది. హింద్ నగర్ ఏరియాలో... కరెంటు షాక్ వల్ల జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీపాలీ మశ్రామ్ (40), రోహిత్ మశ్రామ్ (23)తోపాటూ... కుక్క ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే... రోహిత్ తన గదిలో... బట్టలకు ఐరన్ చేసుకుంటున్నాడు. ఐతే... ఐరన్ బాక్సుకి ఉన్న కరెంటు వైర్‌ని ముందు రోజే ఎలుకలు కొరికేశాయి. ఆ విషయాన్ని అతను గమనించలేదు. అంతలో అక్కడకు వచ్చిన వాళ్ల పెంపుడు కుక్క... అనుకోకుండా ఐరన్ బాక్స్ వైరును చుట్టుకుంది. వెంటనే దానికి కరెంటు ప్రవహించి షాక్ తగిలింది. కుక్కను రక్షించాలనే కంగారులో... వైరును వదిలించబోయి... కుక్కను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగాలని ప్రయత్నించాడు రోహిత్. ఐతే... కరెంటు షాక్ అతనికీ తగిలింది.

కుక్క, రోహిత్... అరుస్తూ విలవిలలాడుతుంటే... వాళ్ల అరుపులకు వంటగది లోంచీ అక్కడకు పరిగెత్తుకొచ్చిన తల్లి దీపాలీ... ఏ కర్రతోనో వాళ్లను విడదీసి ఉంటే బాగుండేది. కానీ... కంగారులో ఆమె కూడా వెళ్లి కొడుకు చేతులు పట్టుకుంది. అంతే... కరెంటు ఆమెకూ ప్రవహించి... ముగ్గురికీ షాక్ గట్టిగా తగిలింది. అంతలో దీపాలీ భర్త సిద్ధార్థ... అటుగా వస్తూ... వాళ్లను చూసి... పరిగెత్తుకొచ్చాడు. భార్య, కొడుకును విడిపించాలని గట్టిగా పట్టుకున్నాడు. ఆయనకూ కరెంటు షాక్ తగిలింది.

అప్పుడే అక్కడకు వచ్చిన పెద్ద కొడుకు ప్రవీణ్ మశ్రామ్ వాళ్లను చూసి... పరిగెట్టుకొని వెళ్లి... మెయిన్ పవర్ సప్లై ఆపేశాడు. అప్పటికే... కుక్క, చిన్న కొడుకు రోహిత్ చనిపోయారు. తల్లిదండ్రులను జిల్లా జనరల్ హాస్పిటల్‌కి తీసుకెళ్తుంటే... తల్లి దారిలోనే ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం తండ్రి సిద్ధార్థ పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషాద ఘటన స్థానికుల్ని కలచివేసింది. కుక్క కోసం ప్రాణాలు అర్పించిన ఆ కుటుంబాన్ని చూసి... అయ్యో పాపం అంటున్నారు స్థానికులు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>