అల్లుడి సొమ్ముపై అత్తకూ హక్కుంటుంది -సుప్రీంకోర్టు సంచలన తీర్పు -ఇదీ కేసు..

సుప్రీంకోర్టు

కూతురుతో కలిసి అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త ఆయనకు చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద అతనికి లభించే పరిహారం పొందడానికి ఆమె ముమ్మాటికీ అర్హురాలేనని పేర్కొంది.

  • Share this:
పితృస్వామ్య భావజాలం బలంగా ఉన్న భారత్ లో అత్తా అల్లుళ్ల వ్యవహారం చాలాసార్లు చర్చకు వస్తుంది. ఆస్తుల విషయానికొస్తే, అత్తసొమ్ముకు ఆశపడని అల్లుడు ఉండడనే సామెత ప్రాచుర్యంలో ఉంది. అనుకోడానికి, మాట్లాడుకోడానికి ఎన్నో ఉన్నా, నిజంగా అత్త - అల్లుళ్ళ వ్యవహారం చట్టబద్దంగా ఎలా ఉంటుంది? ఒకరి సొమ్ముకు మరొకరు బాధ్యులు అవుతారా అనే అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది..

కూతురుతో కలిసి అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త ఆయనకు చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద అతనికి లభించే పరిహారం పొందడానికి ఆమె ముమ్మాటికీ అర్హురాలేనని పేర్కొంది. జస్టిస్‌ ఎస్ఏ నజీర్, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది.

కూతురు-అల్లుడితో కలిసి అత్తలు జీవిస్తుండటం భారత సమాజంలో సహజమేనని, కొద్ది మంది ముసలితనంలో పోషణ నిమిత్తం అల్లుడిపైనే ఆధారపడుతుంటారని, అంతమాత్రాన అల్లునికి అత్త చట్టబద్ధమైన వారసురాలు కాబోదన్న కోర్టు.. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అత్తగారు కచ్చితంగా అల్లుడికి చట్టబద్ధ ప్రతినిధి అవుతారని, ముఖ్యంగా అల్లుడు మరణించిన సందర్భంలో ఆమె బీమా పొందేందుకు అర్హురాలు అవుతుందని, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 166 ప్రకారం అత్తగారు అల్లుడికి చట్టబద్ధమైన ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. చనిపోయిన అల్లుడి బీమా డబ్బులు పొందే హక్కు అత్తకు లేదంటూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

అత్తా అల్లుళ్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పిన ఈ కేసు వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన ఎన్ వేణుగోపాలన్ నాయర్ అనే ప్రొఫెసర్ 2011లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు భార్య ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. దీంతో ఆయన కుటుంబానికి రూ. 74,50,971 పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆ పరిహారాన్ని రూ. 48,39,728కి తగ్గించింది. అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మృతుడి భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 83,831 వేతనం తీసుకుంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అతడు 52 ఏళ్లకే మరణించడంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని..కాబట్టి రూ. 85,81,815 పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
Published by:Madhu Kota
First published: