Black Fungus: భారత్‌లో ఇన్ని బ్లాక్ ఫంగస్ మరణాలా.. సోకకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గమట..!

బ్లాక్ ఫంగస్ సోకిన ఓ బాధితుడు

భారత్‌లో బ్లాక్ ఫంగస్ మరణాలపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక ప్రకటన చేశారు. భారత్‌లో గడచిన రెండు నెలల వ్యవధిలో.. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో 4,300 మంది మరణించారని ఆయన తెలిపారు. భారత్‌లో ఇప్పటివరకూ 45,374 మంది ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారని ఆయన వెల్లడించారు.

  • Share this:
    న్యూఢిల్లీ: భారత్‌లో బ్లాక్ ఫంగస్ మరణాలపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక ప్రకటన చేశారు. భారత్‌లో గడచిన రెండు నెలల వ్యవధిలో.. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో 4,300 మంది మరణించారని ఆయన తెలిపారు. భారత్‌లో ఇప్పటివరకూ 45,374 మంది ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారని ఆయన వెల్లడించారు. ఇక ఈ బ్లాక్ ఫంగస్ విషయానికొస్తే.. ఇది ఒక ఫంగల్ ఇన్‌ఫెక్షన్. ప్రధానంగా ముక్కు, కళ్లు, కొన్ని సందర్భాల్లో మెదడుపై కూడా ఈ ఇన్‌ఫెక్షన్ ప్రభావం చూపుతుంది. కరోనా నుంచి కోలుకున్న కొందరికి 12 నుంచి 18 రోజుల మధ్య ఈ బ్లాక్ ఫంగస్ సోకుతోంది. భారత్‌లో నమోదైన ఈ కేసుల్లో.. ఇప్పటికీ సగం మంది చికిత్స పొందుతూనే ఉన్నారు. కోవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు ఎక్కువగా తీసుకున్న వారు, డయాబెటిక్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కోవిడ్-19 పేషంట్లలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడం వల్ల బ్లాక్ ఫంగస్ సోకుతోందని.. ఈ బ్లాక్ ఫంగస్‌ నుంచి బయటపడాలంటే ఈ ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తికి యాంటీ-ఫంగల్ ఇంజక్షన్స్ ఇవ్వడం ఒక్కటే మార్గమని వైద్యులు తెలిపారు. ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడి మరణించిన వారిలో ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన వారే ఉన్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌లో 1,785 బ్లాక్ ఫంగస్ మరణాలు నమోదయ్యాయి.

    బెంగళూరుకు చెందిన కంటి శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ రఘురాజ్ హెగ్దే ఎంతోమంది బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్సనందిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలు రోజురోజుకూ ఊహించని విధంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో చాలామంది వారం రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలో చనిపోతున్నారని ఆయన తెలిపారు. చిన్నచిన్న హాస్పిటల్స్‌లో ఈ బ్లాక్ ఫంగస్‌కు సరైన చికిత్సా సదుపాయాలు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడటంతో వారు నగరాల్లోకి పెద్దాసుపత్రులకు వచ్చేలోపే పరిస్థితి క్షీణించి మరణిస్తున్నారని పేర్కొన్నారు.

    బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కళ్లపై ప్రభావం చూపుతుండటంతో ఆ ఫంగస్ ఇతర శరీర భాగాలకు సోకకుండా బాధితులను ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు బాధితుల కళ్లను తొలగించాల్సి వస్తోందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. బ్లాక్ ఫంగస్ సోకి కోలుకున్న వారిని రీ ఇన్‌ఫెక్షన్ ఆందోళనకు గురిచేస్తోంది. ఆగ్రాలో.. ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడి కోలుకున్న వారిలో 9 మందికి మళ్లీ ఇన్‌ఫెక్షన్ సోకింది. మరో విషయమేంటంటే.. ఈ రెండో సారి ఇన్‌ఫెక్షన్ సోకిన సందర్భంలో వారిలో ఎలాంటి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. ఈ బ్లాక్ ఫంగస్ సోకకుండా జాగ్రత్త పడేందుకు ఒకటే మార్గమని వైద్యులు చెబుతున్నారు. ఓరల్ హైజీన్ పాటించే వారికి బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు తక్కువేనని అంటున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: