MONSOON ARRIVES IN KERALA 3 DAYS AHEAD OF SCHEDULE TIME SAYS IMD RAINS EXPECTED AND GOOD NEWS TO FARMERS MKS
Monsoon 2022 : వానాకాలం వచ్చేసింది.. కేరళను తాకిన రుతుపవనాలు.. 3 రోజుల ముందే ప్రవేశం: IMD
కేరళను ఆవహించిన కారు మేఘాలు
భారత వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది. వ్యవసాయ దేశమైన భారత్ లో వర్షాలకు ప్రధాన ఆధారంగా ఉన్న నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే ప్రవేశించాయి. రుతుపవనాలు కేరళను తాకినట్లు ఐఎండీ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది.
ఎండదెబ్బకు విలవిల్లాడి.. ఉక్కపోతతో ఇబ్బందులు పడుతోన్న ప్రజలకు వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది. వ్యవసాయ దేశమైన భారత్ లో వర్షాలకు ప్రధాన ఆధారంగా ఉన్న నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే ప్రవేశించాయి. (Monsoon arrives in Kerala) రుతుపవనాలు కేరళను తాకినట్లు ఐఎండీ (IMD) ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది. దీంతో దేశ ప్రధాన భూభాగంలో వర్షాకాలం సీజన్ ఎంటరైనట్లయింది..
సాధారణం కంటే మూడు రోజుల ముందుగానే కేరళను రుతుపవనాలు పలకరించినట్లు వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగిందని.. వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది త్వరగా భారత్లోకి ప్రవేశించాయని స్పష్టం చేశారు.
నిజానికి రుతుపవనాల విషయంలో గత వారం రోజులుగా భిన్న ప్రకటనలు వెలువడ్డాయి. సాధారణంగా జూన్ 1న కేరళకు చేరాల్సిన రుతుపవనాలు ఈసారి ఐదు రోజుల ముందుగానే వస్తాయని, మే 27లోగా మేఘాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. కానీ రుతుపవనాల రాకకు తగిన పరిస్థితులు లేవని అదే ఐఎండీ గురువారం ప్రకటించింది. అయితే, శుక్రవారం కాస్త మెరుగుదల కనిపించినట్లు తెలిపింది.
దక్షిణ అరేబియా సముద్రంపైన దిగువ స్థాయుల్లో పశ్చిమ గాలులు బలపడ్డాయని, ఉపగ్రహ ఛాయాచిత్రాలనుబట్టి కేరళ తీరం, దాని పరిసరాల్లోని ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆకాశం మేఘావృతమైందని, కేరళకు రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో వచ్చేందుకు సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐఎండీ శుక్రవారం పేర్కొంది. చివరికి ఆదివారం మధ్యాహ్నం నాటికి రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంటరైపోయినట్లు ఐఎండీ తాజా ప్రకటనలో పేర్కొంది.
ఇవాళ కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిదానంగా ప్రయాణించి, మరో వారం లోపే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీని తాకనున్నాయి. రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత కేరళలో వాతావరణం దాదాపు చల్లబడింది. మరికొద్ది రోజుల్లోనే మిగతా ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోవడం ఖాయమైంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గతంలో వెల్లడించింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.