MONEY COLLECTED VIA CESS WILL ALSO BE GIVEN TO STATES FM NIRMALA SITHARAMAN TELLS NEWS18 SK
Budget 2021:అగ్రి సెస్ నిధులను రాష్ట్రాలకే ఇస్తాం.. న్యూస్ 18 ఇంటర్వ్యూలో నిర్మల సీతారామన్
న్యూస్ 18 ఇంటర్వ్యూలో నిర్మల సీతారామన్
FM to News18: విదేశీ మద్యం ఉత్పత్తులపై 100 శాతం, యాపిల్‌పై పళ్లపై 35శాతం, సోయాబీన్, పొద్దుతిరుగుడు ముడి నూనెపై 20శాతం, ముడి పామాయిల్‌పై 17.5 శాతం, బంగారం, వెండి మీద 2.5 శాతం చొప్పున అగ్రి ఇన్ఫ్రా సెస్ విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
సోమవారం పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కొత్తగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ (AIDC)ను తీసుకొచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై సెస్‌ల పేరుతో భారం మోపుతారా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో AIDCపై నిర్మల సీతారామన్ స్పష్టత ఇచ్చారు. నెట్వర్క్ 18 ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో ఇంటర్వ్యూ సందర్భంగా బడ్జెట్‌తో పాటు పలు అంశాలపై ఆమె మాట్లాడారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొట్ట మొదటగా ఒక ప్రైవేట్ న్యూస్ నెట్‌వర్క్‌తో నిర్మలా సీతారామన్ ముచ్చటించారు. AIDCతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. దాని వల్ల ప్రజలపై అదనపు భారం పడదని చెప్పారు. అంతేకాదు దాని ద్వారా సమకూరే నిధులను రాష్ట్రాలకే కేటాయిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
''వ్యవసాయ ప్రాథమిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి పన్ను (AIDC) ద్వారా వసూలు చేసే డబ్బును రాష్ట్రాలకే కేటాయిస్తాం. ఆ నిధులను మౌలికసదుపాయాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. ఈ పన్ను వలన వినియోగదారులు, దిగుమతిదారులపై అదనపు భారం పడదు.'' అని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. పెట్రోలుపై రూ. 2.50, డీజిల్ మీద రూ. 4 చొప్పున అగ్రి ఇన్ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్‌ల మీద బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తున్నామని, తద్వారా అగ్రి సెస్సు విధించినా ప్రజలపై అదనపు భారం పడదని తెలిపారు. అంతేకాదు విదేశీ మద్యం ఉత్పత్తులపై 100 శాతం, యాపిల్‌పై పళ్లపై 35శాతం, సోయాబీన్, పొద్దుతిరుగుడు ముడి నూనెపై 20శాతం, ముడి పామాయిల్‌పై 17.5 శాతం, బంగారం, వెండి మీద 2.5 శాతం చొప్పున అగ్రి ఇన్ఫ్రా సెస్ విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
కాగా, కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ 2021- 22 ముఖ్యంగా ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ఉపసంహరణ, ఎన్నికలు ఉన్న రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది. ఆరోగ్య రంగం కోసం కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. ఆత్మనిర్భర ఆరోగ్య పథకానికి రూ. 2,23,486 కోట్లు, రక్షిత మంచినీటి పథకానికి రూ.87,000 కోట్లు, స్వచ్ఛభారత్ అర్బన్ పథకానికి రూ. 141679 కోట్లు ప్రతిపాదించింది. అలాగే, కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35వేల కోట్లు కేటాయించింది. దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గెయిల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైప్ లైన్లలో పెట్టుబడుల ఉపసంహరించాలని నిర్ణయిం తీసుకున్నారు. జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. 1938 బీమా చట్టానికి సవరణ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇన్సూరెన్స్ కంపెనీల్లో FDI పరిమితి 49 శాతం నుంచి 74 శాతానికి పెంచారు. ఈ ఏడాదిలోనే LIC IPO ఉంటుందని స్పష్టం చేశారు