సాధారణంగా ప్రజలు తమ పెంపుడు జంతువులకు పేర్లు పెడుతుంటారు. కానీ కర్ణాటక (Karnataka)లో కీటకాలకు నామకరణం చేశారు. అవి కూడా సాదా సీదా పేర్లు కాదు. బాలీవుడ్ (Bollywood)లో అలనాడు సంచలనం రేపిన సినిమా పాత్రల పేర్లు పెట్టారు. కర్ణాటకలోని గడగ్ శాస్త్రవేత్తలు ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ పద్ధతి సత్ఫలితాలు ఇస్తుండటం విశేషం. ఈ నూతన విధానం గురించి ఇప్పుడు చూద్దాం.
* మొగాంబో, రాము కాక
మొగాంబో(Mogambo).. ఈ పేరు వింటే ఠక్కున గుర్తొచ్చేది బాలీవుడ్ నటుడు అమ్రీష్ పురి(Amrish Puri). 1987లో విడుదలైన ‘మిస్టర్ ఇండియా’ సినిమాలో మొగాంబో పాత్ర పోషించాడు అమ్రీష్ పురి. ఈ పాత్రకు ఎంతో పేరొచ్చింది. అందుకే అలనాటి మొగాంబో పాత్రను గుర్తు చేసుకుంటూ ఓ కీటకానికి ఆ పేరు పెట్టారు. మరో కీటకానికి ‘రాము కాక’(Ramu Kaka) అని నామకరణం చేశారు పరిశోధకులు. బాలీవుడ్‌లోని చాలా సినిమాల్లో ఈ పాత్ర సుపరిచితం. దివంగత నటుడు ఏకే హంగల్(AK Hangal) ఈ పాత్రకే వన్నె తెచ్చారు. రాము కాకగా ఎంతో ప్రసిద్ధి చెందారు. ఇలా కీటకాలకు సినిమా పాత్రల పేర్లు పెట్టడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
* ఉద్దేశం ఏంటంటే?
కీటకాలకు ఈ పేర్లు పెట్టడం వల్ల సినిమా రంగానికి అమ్రిష్ పురి, ఏకే హంగల్ చేసిన సేవలను స్మరించుకున్నట్లు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో పాటు జూనియర్ పరిశోధకులు సులువుగా ఈ పేర్లను గుర్తించి అధ్యయనం చేయగలరని స్పష్టం చేస్తున్నారు. ఏప్‌ఫ్లైప్యుపా2(Apeflypupa2) కీటకానికి మొగాంబో, హలియోమార్ఫా హలిస్(Halyomorpha Halys) కీటకానికి ‘రాము కాక’ పేరు పెట్టినట్లు చెప్పారు. వీటితో పాటు మరిన్ని జాతులకు కర్ణాటకలోని గడగ్ పరిశోధకులు ఇతర పేర్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పద్ధతి ట్రెండింగ్‌లో ఉంది. పైగా పరిశోధకులు కూడా ఈ ఇనిషియేటివ్‌ని స్వాగతిస్తుండటం విశేషం.
* సులభంగా గుర్తుండాలనే ఇలా
జూనియర్ పరిశోధకుల కోసం కీటకాలకు ఇలా పేర్లు పెడుతున్నట్లు సగమేశ్ కడగడ్, మంజునాథ్ నాయక్‌లు వెల్లడించారు. ఫలితంగా వీటిని త్వరగా గుర్తు పట్టగలరని చెప్పారు. ఇలా సినిమా పాత్రల పేర్లతో పాటు రాజకీయ నాయకులు, క్రికెటర్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నామని వారు తెలిపారు. అయితే, ఆ పేర్లను ఇంకా ఖరారు చేయాల్సి ఉందని క్లారిటీ ఇచ్చారు.
కీటకాల ఆకారం, స్వరూపాన్ని బట్టి వాటికి పేర్లు పెడుతున్నట్లు ఈ పరిశోధకులు తెలిపారు. తద్వారా ఈ నమూనాలను త్వరగా గుర్తించగలరని సగమేశ్, మంజునాథ్ చెప్పారు. అయితే, ముందుగా ఈ కీటకాల శాస్త్రీయ నామాలను జూనియర్ రీసెర్చర్లకు చెబుతున్నామని, ఆ తర్వాతే కొత్త పేర్లు పెడుతున్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.
* హిట్లర్, భళ్లాలదేవ పేర్లు కూడా ఉన్నాయి
కీటకాలకు ఇలా పేర్లు పెట్టడం తొలుత కెటాకాంథస్ ఇన్‌కార్నటస్(Catacanthus Incarnatus) కీటకంతో మొదలైంది. దీని ఆకారం, స్వరూపం చూసి పరిశోధకులు ‘హిట్లర్’ అని పేరు పెట్టారు. ఈ కీటకం వీపు భాగంలో అచ్చం హిట్లర్‌ను పోలిన పిల్లి గడ్డం, కనుబొమ్మలు, హెయిర్‌స్టైల్ ఉండటంతో అలా పేరు పెట్టారు. ఇదే విధంగా ఏప్‌ఫ్లైప్యుపా2(Apeflypupa2) కీటకానికి మొగాంబో, హలియోమార్ఫా హలిస్(Halyomorpha Halys) కీటకానికి ‘రాము కాక’ పేర్లు పెట్టారు. వీటితో పాటు ఓ సాలీడుకి బాహుబలి సినిమాలోని ‘భళ్లాలదేవ’ క్యారెక్టర్ పేరు పెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bugs, Karnataka, National News, Rana