హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వీగిన అవిశ్వాసం : బీజేపీకి పెరిగిన సపోర్ట్

వీగిన అవిశ్వాసం : బీజేపీకి పెరిగిన సపోర్ట్

లోక్‌సభలో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

లోక్‌సభలో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఊహించిన రాజకీయ పరిణామాలు జరిగాయి. మద్దతిస్తారనుకున్న వాళ్లు వాకౌట్ చేస్తే.. తటస్థంగా ఉంటారనుకున్న వారు ప్రభుత్వానికి సపోర్టుగా నిలిచారు.

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసానికి అనుకూలంగా 126, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. మొత్తం 451 ఓట్లు పోలయ్యాయి. శివసేన, టీఆర్ఎస్, బిజూ జనతాదళ్ ఎంపీలు గైర్హాజరయ్యారు. 37 మంది ఎంపీలు ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వానికి అండగా నిలబడింది. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. దీంతో ప్రభుత్వానికి 325 ఓట్లు వచ్చాయి. దీంతో మోదీ ప్రభుత్వ ఫుల్ ఖుషీలో ఉంది. శివసేనతో కలసి ఎన్డీయేకు 314 మంది ఎంపీల బలం ఉంది. అయితే, వారు సడన్‌గా సభకు రాకూడదని నిర్ణయించి బీజేపీ నెత్తిన పాలు పోసింది. అదే సమయంలో తటస్థంగా ఉంటుందనుకున్న అన్నాడీఎంకే మోదీకి జై కొట్టింది. దీంతో అనుకున్నదాని కంటే అదనంగా మద్దతు సాధించింది ఎన్డీయే ప్రభుత్వం.

ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అవిశ్వాసంపై చర్చ జరిగింది. టీడీపీ తరఫున గల్లా జయదేవ్ చర్చను ప్రారంభిస్తే.. మధ్యలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. కాంగ్రెస్ తరఫున రాహుల్, మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. అధికార బీజేపీ తరఫున కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలువురు ఎంపీలు మాట్లాడారు. గల్లా జయదేవ్ స్పీచ్ కంటే రాహుల్ ఆరోపణలు, ఆయన చేసిన పనులు సభలో హైలెట్‌గా నిలిచాయి. ప్రధాని మోదీని దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ అధ్యక్షుడు తన ప్రసంగం చివర్లో.. మోదీ కూర్చునే సీటు వద్దకు వెళ్లి ఆయన్ను హత్తుకోవడం సంచలనంగా మారింది. అయితే, ఆ తర్వాత మిత్రులకు కన్నుకొట్టి మీడియాకు దొరికిపోయారు. మరోవైపు సభా నాయకుడి హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ అవిశ్వాస తీర్మానంపై సమాధానం ఇచ్చారు. విపక్షాల మధ్య విశ్వాసం లేక.. అవిశ్వాసం తీసుకొచ్చాయని విమర్శించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అన్నిటికీ కౌంటర్ ఇచ్చారు. 14వ ఫైనాన్స్ కమిషన్ తమ చేతులు కట్టేసిందని, ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని మరోసారి స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల హోదాతో సమానంగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. చివరకు 2024లో కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి..అవిశ్వాసం పెట్టాలని ఆకాంక్షించారు.

మొత్తానికి 2019 ఎన్నికల్లో ఎవరు ఎటువైపు నిలుస్తారని చెక్ చేసుకునేందుకు ఈ అవిశ్వాస తీర్మానం ఉపయోగపడింది. ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి కాంగ్రెస్ శ్రమించినా.. అనూహ్యంగా బీజేపీకే మద్దతు పెరిగింది. టీఆర్ఎస్ మాత్రం చివరి నిమిషంలో సభ నుంచి వాకౌట్ చేసింది.

First published:

Tags: Bjp-tdp, Chandrababu Naidu, Narendra modi

ఉత్తమ కథలు