అవి.. దేశంలో ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజులు.. సంఘ్, సోషలిస్టు నేతలు, కార్యకర్తలు దాదాపు అందరినీ అరెస్టు చేసి జైళ్లలో వేస్తున్నారు. ఆ రోజుల్లో మోదీ చేసిన ఓ పని గురించి గుజరాత్‌వాసి రోహిత్ అగర్వాల్ ఇలా చెబుతారు.. మోదీ ఎమర్జెన్సీ కాలంలో సిక్కు మతస్థుని మాదిరిగా దుస్తులు వేసుకుని, పోలీసుల నుంచి తప్పించుకున్నారు. పగడీతో సర్దార్జీ మాదిరిగా బట్టలు వేసుకుని మోదీ ఓసారి బయటకు వెళ్ళారని, అప్పుడు ఓ పోలీసు ఆయన దగ్గరికే వచ్చి.. నరేంద్ర మోదీ ఎక్కడ ఉంటాడని అడగ్గా.. ‘మోదీనా? ఆయనెవరో నాకు తెలీదు.. ఆ ఇంట్లోకి వెళ్లి అడిగిచూడండి’అని పోలీసులకు మస్కా కొట్టారు. ఆ వెంటనే అగర్వాల్ సోదరుని స్కూటర్ ఎక్కి మోదీ పోలీసు నుంచి తప్పించుకున్నారు. ఈ విధంగా వస్త్రాలు ధరిస్తూ ఆయన తమను కూడా మాయ చేసేవారని రోహిత్ అగర్వాల్ గుర్తుచేశారు. ఇది..
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా పేరుపొందిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి మీకు ఏం తెలుసు? ఇప్పటిదాకా విన్నవి, ప్రచారంలో ఉన్నవి, మనం ప్రత్యక్షంగా తెలుసుకున్నవి కాకుండా మోదీ జీవితంలోని అనూహ్య, ఆసక్తికర, స్ఫూర్తిదాయక అంశాలతో ‘మోదీ స్టోరీ’ పేరుతో ఓ వెబ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. పైన మనం చెప్పుకున్న మోదీ మారువేషం ఘటన ‘మోదీ స్టోరీ’ వెబ్ సైట్ కోసం రోహిత్ అగర్వాల్ చెప్పిందే. మహాత్మా గాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి శనివారం నాడు ‘మోదీ స్టోరీ’ వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలతోపాటు పలువురు కేంద్ర మంత్రులూ మోదీ స్టోరీ వెబ్ సైట్ విశేషాలను షేర్ చేశారు.
నరేంద్ర మోదీ చిన్నప్పుడు చెరువులో మొసలి పిల్లను పట్టుకొచ్చి అమ్మ చేత చీవాట్లు తినడం.. వాద్ నగర్ రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మడం.. బాల్యవివాహంలో ఇమడలేక భార్యను వదిలేయడం.. ఆర్ఎస్ఎస్ లో చేరి దేశాటన చేయడం.. ఎమర్జెన్సీ సమయంలో మారు వేషంలో అండర్ గ్రౌడ్ జీవితం.. కనీసం ఎమ్మెల్యే కాకుండానే గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం.. దశాబ్దాలపాటు ఆ రాష్ట్రంలో పార్టీని తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టడం.. గుజరాత్ మోడల్ ఊపుతో మోదీ దేశ ప్రధాని కావడం.. గడిచిన 7ఏళ్లలో ఎన్నెన్నో కొత్త విధానాలు, ఎన్నికల విజయాలు.. ఇలా 71ఏళ్ల మోదీ జీవితంలో అనూహ్య, ఆసక్తికర ఘట్టాలెన్నో ఉన్నాయి. ఆయా సందర్భాల్లో ప్రత్యక్ష సాక్షులుగా నిలిచినవాళ్లు, మోదీ జీవితాన్ని సన్నిహితంగా చూసినవారు, ఆయనతో ప్రత్యేక అనుబంధమున్న ఎంతోమంది చెప్పే స్ఫూర్తిదాయక అంశాలతో కూడిన ఓ వెబ్‌సైట్ ‘మోదీ స్టోరీ’ ఇవాళే ప్రారంభమైంది.
మోదీతో సన్నిహితంగా మెలగినవారి జ్ఞాపకాలు, వారు చెప్పే కథనాలు Modi Story పోర్టల్ లో ఉంటాయి. కొందరు నెటిజన్లు స్వచ్ఛందంగా దీనిని నిర్వహిస్తున్నారు. మోదీని కలిసినవారు తమ జ్ఞాపకాలను తమతో పంచుకోవచ్చని, వ్యాసాలు, ఆడియో లేదా విజువల్ స్టోరీస్, చిన్న కథలు, మోదీతో ఫొటోలు, ఆయన రాసిన లేఖలు లేదా వ్యక్తిగత జ్ఞాపకాలు వంటివాటిని పంపించవచ్చని వెబ్ సైట్ నిర్వాహకులు తెలిపారు.
మోదీ స్టోరీ వెబ్ సైట్ లో గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో మోదీ చదువుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ రాస్ బిహారీ మణియార్, 90వ దశకంలో ఆయనకు ఆశ్రయం కల్పించిన శారదా ప్రజాపతి వంటి వారు ఎంతోమంది మోదీతో తమ అనుబంధాలను పంచుకున్నారు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ కోచ్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ సహా మరికొందరు మోదీతో తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో మోదీ ఆలోచనలు, విద్యార్ధిగా సైనిక దళాలపై ఆయన అభిప్రాయాలు, దేశ సేవపై ఆసక్తి వంటి వివరాలు ఇందులో ఉన్నాయి.
మోదీ జీవితంలో కీలక మార్పులకు దారి తీసిన సందర్భాలెన్నో మోదీ స్టోరీ వెబ్ సైట్ లో పోందుపర్చారు. అందులో గుజరాత్‌కు చెందిన డాక్టర్ అనిల్ రావల్ అనే వ్యక్తి చెప్పిన అనుభవం ప్రస్తుతం అందరినీ కదిలిస్తున్నది. చిట్ట చివరి వ్యక్తిని ఉద్ధరించడానికి అంకితమయ్యేలా మిమ్మల్ని ప్రేరేపించినదేమిటి? అని రావల్ మోదీని అడగ్గా ఓ పేదరాలి ఇంటికి వెళ్లినప్పటి సందర్భాన్ని మోదీ గుర్తుచేస్తారు..
‘నేను ఓసారి ఓ స్వయంసేవక్ ఇంటికి వెళ్లాను. అది ఓ మురికివాడలో ఉంది. ఆ ఇంట్లో స్వయంసేవక్ తన భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. నేను వెళ్లగానే నాకు పళ్లెంలో సగం రొట్టె, చిన్న గిన్నెలో పాలు తీసుకొచ్చి అందించారు. తల్లి ఒడిలో కూర్చున్న ఆ చిన్నారి ఆ పాలగిన్నె వైపు ఆకలిగా చూస్తున్నాడు. అప్పుడే నాకు అర్థమైంది ఆ పాలు చిన్నారి కోసం ఉంచినవి అని. నేను ఆ సగం రొట్టెను నీళ్లతో తినేసి పాలు వదిలేశారు. ఆ తర్వాత ఆ తల్లి పాలగిన్నెను చిన్నారికి ఇచ్చింది. ఆ బాబు వాటిని గడగడా తాగేశాడు. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే నేను నిర్ణయించుకున్నా. సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి కోసమే నా ఈ జీవితం అంకితం చేయాలని’ అని మోదీ చెప్పినట్లు డాక్టర్ రావెల్ రాసుకొచ్చారు. మోదీ స్టోరీ వెబ్ సైట్ ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంది. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం https://www.modistory.in/ చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.