అనంతకుమార్ లేని లోటు తీర్చలేనిది.. ప్రముఖుల నివాళి

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు కూడా అనంతకుమార్ మృతికి సంతాపం ప్రకటించారు.

news18-telugu
Updated: November 12, 2018, 11:40 AM IST
అనంతకుమార్ లేని లోటు తీర్చలేనిది.. ప్రముఖుల నివాళి
కేంద్ర మంత్రి అనంతకుమార్ (File)
  • Share this:
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతకుమార్ మరణం దేశానికి తీరనిలోటు అని ట్వీట్ చేశారు. అనంతకుమార్ మరణంపై రాహుల్ గాంధీ సహా పలువురు ఇతర పార్టీల నేతలు కూడా సంతాపాన్ని ప్రకటించారు. 59 ఏళ్ల అనంతకుమార్ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గత రాత్రి 2గంటలకు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపంగా కర్ణాటక ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. మూడు రోజులు సంతాపదినాలు పాటించనున్నారు. అనంతకుమార్‌ పార్ధివదేహానికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేంద్ర మంత్రి మరణానికి సంతాపంగా ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జాతీయ జెండాను అవనతం చేశారు.

అనంతకుమార్ మరణం దేశానికి, కర్ణాటక ప్రజలకు తీరని లోటు అని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ట్వీట్ చేశారు. ఆయన మరణవార్త విని తాను ఎంతో బాధపడినట్టు తెలిపారు.

దేశం కోసం, అణగారిన వర్గాల కోసం పనిచేసిన అనంతకుమార్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటు అన్నారు.
Loading...


అనంతకుమార్ మంచి పరిపాలన నైపుణ్యం కలిగిన వారని, ఆయన మరణం తనను దిగ్భ్రాంతి గురి చేసిందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బీజేపీ బలోపేతం వెనుక అనంతకుమార్ కృషి ఉందన్నారు. అనంతకుమార్ భార్య తేజస్వినితో మాట్లాడినట్టు తెలిపిన ప్రధాని మోదీ, అనంతకుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


అనంతకుమార్ మృతికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. అనంతకుమార్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ‘ఓంశాంతి’ అంటూ ట్వీట్ చేశారు.


అనంతకుమార్ మృతితో తాను ఓ స్నేహితుడిని కోల్పోయానని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ప్రజల కోసం ఎంతో సేవ చేశారంటూ అనంతకుమార్‌ను కొనియాడారు. విలువలతో నడిచిన నాయకుడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు.


అనంతకుమార్ మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు సంతాపం ప్రకటించారు. కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

పలువురు కేంద్ర మంత్రులు కూడా సంతాపం ప్రకటించారు. అనంతకుమార్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు.
First published: November 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...