ఎండలు మండిపోతున్నాయ్.. ఇంకా మార్చి కూడా రాలేదు.. అప్పుడే హీట్ వేవ్(heat wave) మొదలైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదినా భానుడు భగభగమంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. మండు వేపవిని తట్టుకోవడం ఏ మాత్రం ఈజీ కాదు.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతి.. అటు ప్రభుత్వాలు కూడా ఇప్పటినుంచే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టాయి. రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే పలు సూచనలు కూడా చేసింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ(modi) సైతం ఎండల విషయంలో రాష్ట్రాలకు అలెర్ట్ చేశారు.
దీటుగా ఎదుర్కొవాలి:
రానున్న వేసవిలో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రజలతో పాటు వైద్య నిపుణులకు, స్థానిక సంస్థలకు సమగ్ర అవగాహన కల్పించాలని మోదీ సూచించారు. రాబోయే నెలల్లో తీవ్ర ఎండలున్నందున తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు ఆహార ధాన్యాల నిల్వలను ఎఫ్‌సీఐ వీలైనంతగా పెంచాలని మోదీ చెప్పారు. వచ్చే వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలను మోదీ దృష్టికి తెచ్చారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. రబీ పంటలపై వాతావరణ ప్రభావం, ప్రధాన పంటల దిగుబడుల అంచనాల గురించి ప్రధానికి వివరించారు. వేడి, ఉపశమన చర్యలకు సంబంధించిన విపత్తులను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ ప్రయత్నాల గురించి చెప్పారు.
విపరీతమైన ఎండ పరిస్థితులు:
వడగాల్పులను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలను అప్రమత్తం చేశారు మోదీ. రానున్న రోజుల్లో సాధారణం కంటే ఎక్కువగా వడగాల్పులు వీస్తాయని తెలుస్తోంది. అటు 'ఫైర్ ఆడిట్' అవసరాన్ని నొక్కిచెప్పారు మోదీ. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున అన్ని ఆస్పత్రుల్లో ఫైర్ ఆడిట్ చేయడంతో పాటు రోజువారీ వాతావరణ నివేదికలను ప్రకటించాలని మోదీ ఆదేశించారు. రోజువారీ వాతావరణ నివేదికలను సిద్ధం చేసి ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలా ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులకు మోదీ సూచించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. విపరీతమైన ఎండ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పశుగ్రాసం, రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలన్నారు. వేడి వాతావరణానికి ప్రోటోకాల్స్, చేయవలసినవి, చేయకూడనివి అందుబాటులో ఉండే ఫార్మాట్లలో, జింగిల్స్, షార్ట్ స్టోరీస్ లాంటి ఇతర ప్రచార పద్ధతలు వాడుకోవాలని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, Summer