ప్రధాని మోదీపై సినీనటి, కాంగ్రెస్ నేత ఊర్మిళ మటోండ్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యక్తిగతంగా మంచి వ్యక్తేనని..కానీ ప్రధానిగా ఆయన అనుసరిస్తున్న విధానాలే మంచివి కావని అన్నారు. ప్రజాస్వామ్యదేశంలో ఏం మాట్లాడాలో? ఏం తినాలో? నిర్ణయించుకునే హక్కు ప్రజలకు ఉందని..కాని వాటిని మోదీ కాలరాశారని విమర్శించారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని..మతం పేరుతో ప్రజలు కొట్టుకు చస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాయలంలో మాట్లాడిన ఊర్మిళ..మోదీ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు.

మోదీ వ్యక్తిగతంగా మంచివారే. కానీ ఆయన విధానాలు సరైనవి కావు. మోదీ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోయింది. మతం పేరుతో ప్రజలు కొట్టుకుటున్నారు. మోదీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదు. నిరుద్యోగం సమస్య పెరిగిపోయింది.
— ఊర్మిళ, కాంగ్రెస్ నేత
గాంధీ, నెహ్రూ కుటుంబాల గురించి చాలా చదివానని..కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చే ఆ పార్టీలో చేరానని చెప్పారు. కేవలం ఎన్నికల కోసమే రాజకీయాల్లోకి రాలేదన్నారు ఊర్మిళ. తాను పోరాటం చేయాల్సిన అంశాలు చాలనే ఉన్నాయని..రాజకీయాల్లో సుదీర్ఘమైన ఇన్సింగ్స్ ఆడాల్సి ఉందని స్పష్టంచేశారు. ఇకపై నాలుగు గోడల మధ్య మాట్లాడాల్సిన అవసరం లేదని...తన గళం విప్పేందుకు కాంగ్రెస్ వంటి పెద్ద వేదిక దొరికిందని చెప్పుకొచ్చారు.
కాగా, ఊర్మిళ మటోండర్కర్ బుధవారమే కాంగ్రెస్లో చేరారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఊర్మిళా మటోండ్కర్ ముంబై నార్త్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది.