పల్లెలే కాదు పట్టణాల్లోనూ పవర్ కట్ సమస్యలుంటాయి. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో తప్పితే మిగతా ప్రాంతాల ప్రజలకు ఇలాంటి ఇబ్బందుల నిత్యం ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా మరో సంచలన నిర్ణయానికి కేంద్రం సిద్ధమవుతోంది. కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగితే విద్యుత్ పంపిణీ సంస్థలకు భారీ మొత్తంలో జరిమానా విధించేలా కొత్త విద్యుత్ విధానాన్ని ప్రకటించబోతోంది. ఇప్పటికే ప్రతిపాదిత ఎలక్ట్రిసిటీ పాలసీని విద్యుత్ శాఖ కేంద్ర కేబినెట్‌కు పంపించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
కొత్త విద్యుత్ విధానం ప్రకారం...విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి. ఒకవేళ పవర్ కట్స్‌తో వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తే సదరు పంపణీ సంస్థలకు జరిమానాలు విధిస్తారు. ఐతే ప్రకృతి విపత్తులు, సాంకేతిక సమస్యలు, ముందస్తు సమాచారంతో విద్యుత్ నిలిపేయడం కారణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కానీ సరైన కారణం లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే మాత్రం జరిమానా విధిస్తారు. ఆ డబ్బులను నేరుగా వినియోగదారుడి అకౌంట్‌కి జమ చేస్తారు. ఐతే ఎంత జరిమానా విధించాలన్నది స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయిస్తుంది. ఇక విద్యుత్ టారిఫ్‌లోనూ భారీగా మార్పులు చేస్తారని సమాచారం.
అంతేకాదు ప్రభుత్వం అందించే విద్యుత్ సబ్సిడీని పంపిణీ సంస్థలకు కాకుడా నేరుగా వినియోగదారుల ఖాతాలోకి పంపించాలని ఎలక్ట్రిసిటీ పాలిసీలో పొందుపరిచారు. ఎంత తక్కువ కరెంట్‌ని వినియోగిస్తే అంత ఎక్కువ సబ్సిడీ అందుతుంది. దీని ద్వారా కరెంట్‌ను ఆదా చేసే దిశగా వినియోగదారులను ప్రోత్సహించినట్లువుతుందని కేంద్రం భావిస్తోంది. ఎక్కువ సబ్సిడీని పొందేందుకు వినియోగదారులు విద్యుత్‌ను ఎక్కువగా ఆదా చేస్తారని అంచనా వేస్తోంది. ఇక వచ్చే మూడేళ్లలో వినియోగదారులందరికీ స్మార్ట్, ప్రిపెయిడ్ మీటర్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. వీటిని మొబైల్ ఫోన్ తరహాలో రీచార్జ్ చేసుకోవచ్చు. వీటి ద్వారా తమకు అవసరమైన మేరకే కరెంట్‌ను వినియోగించుకునే వెలుసుబాటు ఉంటుంది. త్వరలోనే ఈ కొత్త విద్యుత్ టారిఫ్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలుపుతుందని సమాచారం.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.