KTR-Udayanidhi Stalin: సీఎంగా ప్రమాణం చేయబోయే స్టాలిన్ కుమారుడు ఉదయానిధి స్టాలిన్ మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? ఇస్తే ఆయన ఏ శాఖను అప్పగించబోతున్నారనే అంశం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో అధికార మార్పిడి జరిగింది. అధికార అన్నాడీఎంకేను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. మరికొద్దిరోజుల్లోనే డీఎంకే తరపున కరుణానిధి కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 7న ఇందుకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా తాను ప్రమాణస్వీకారం చేయడానికి ముందే తన కేబినెట్లో ఎవరెవరు ఉండాలనే అంశంతో పాటు ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఎవరిని నియమించాలనే అంశంపై ఆయన డీఎంకే ముఖ్యనేతలతో చర్చలు జరిపారని.. ఇందుకు సంబంధించి ఓ స్పష్టతకు వచ్చారని తమిళనాట చర్చ జరుగుతోంది.
అయితే అన్నింటికీ మించి.. సీఎంగా ప్రమాణం చేయబోయే స్టాలిన్ కుమారుడు ఉదయానిధి స్టాలిన్ మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? ఇస్తే ఆయన ఏ శాఖను అప్పగించబోతున్నారనే అంశం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన కుమారుడిని పూర్తిస్థాయిల్లో రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఎన్నికల బరిలో నిలిపిన స్టాలిన్.. ఉదయానిధిని కెబినెట్లోకి తీసుకోవడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. డీఎంకే భవిష్యత్తు నాయకుడిగా తన కుమారుడు ఉదయానిధి స్టాలిన్‌ను ప్రొజెక్ట్ చేయాలని ఆలోచనతో ఉన్న స్టాలిన్... మంత్రివర్గంలోనూ కుమారుడికి కీలకమైన పదవులు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ విషయంలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఫాలో కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులోని చెపాక్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన ఉదయానిధి స్టాలిన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని అతడికి మున్సిపల్, హౌసింగ్, స్లమ్ క్లియరెన్స్ బోర్డు, టౌన్ ప్లానింగ్, అర్బన్ డెవల్‌పమెంట్, సీఎండీఏ శాఖలకు సంబంధించిన బాధ్యతలను అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం తన కుమారుడు కేటీఆర్‌కు ఇవే శాఖలు కేటాయించారు.
ఉదయానిధి, కేటీఆర్ (ఫైల్ ఫోటో)
తొలిసారి విజయం సాధించిన తరువాత.. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కేటీఆర్‌కు మున్సిపల్ శాఖను అప్పగించారు సీఎం కేసీఆర్. పట్టణాల అభివృద్ధిలో ఈ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే ఉద్ధేశ్యంతోనే కేసీఆర్ కేటీఆర్‌కు ఈ శాఖను అప్పగించారనే టాక్ ఉంది. తాజాగా తమిళనాడు సీఎంగా ప్రమాణం చేయబోతున్న స్టాలిన్ సైతం తన కుమారుడు ఉదయానిధికి ఇదే శాఖను అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. కుమారుడిని రాజకీయాల్లో నిలబెట్టేందుకు స్టాలిన్ కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారని భావించాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.