వాతవరణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎండా కాలంలో భారీ వర్షాలు, ఏడారుల్లో మంచు వర్షం.. ఇలా ఎన్నో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. దీనికి కారణం.. పర్యావరణ కాలుష్యం. వాతావరణ మార్పుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐతే వాతావరణ మార్పుల గురించి శాస్త్రవేత్తలే మాట్లాడాలి.. వారే పరిష్కారం చూపాలి అని అనుకోవడం పొరపాటు. ఎవరికి వారు పర్యావరణం పట్ల అవగాహన పెంచుకోవాలి. పర్యావరణ పరిరక్షణ కోసం నడుబిగించాలి. మన దేశానికి చెందిన బాలిక లిసిప్రియ కంగుజమ్.. అందరికంటే ముందుంటుంది. ఈమె వయసు 9 ఏళ్లు. ఇంత చిన్న వయసులోనూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోంది.
లిసిప్రియ స్వస్థలం మణిపూర్‌లోని బషిఖోంగ్. ప్రపంచ పర్యావరణవేత్తల్లో ఈమె అతి పిన్న వయస్కురాలు. కానీ అంతగా ఎవరికీ తెలియదు. అదే స్వీడిష్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్‌కు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ప్రసంగాలు చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం చిన్న వయసులోనే కృషి చేస్తోంది. ఐతే లిసిప్రియ కంగుజమ్‌కు మాత్రం మన దేశంలో కూడా రావాల్సినంత గుర్తింపు రాలేదు. 2019లో స్పెయిన్‌లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ కాన్ఫరెన్స్ (COP25)లో పాల్గొని ప్రసంగించింది లిసిప్రియ. మన గ్రహాన్ని కాపాడుకోవాలంటూ ఆమె చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా పేరు సాధించింది. అప్పుడా బాలిక వయసు 8 ఏళ్లు మాత్రమే.
If we spend all the money spending on war on finding environmental answers, ending poverty and giving education then what a wonderful place this earth would be! Plz protect our environment and save our future. ?? pic.twitter.com/vlNakYGr9H
— Licypriya Kangujam (@LicypriyaK) December 10, 2019
ప్రజల్లో పర్యావరణం గురించి అవగాహన కల్పించేందుకు రెండేళ్లుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది లిసిప్రియ కంగుజమ్. వాతావరణ మార్పుల గురించిన పాఠాలను స్కూళ్లో తప్పని సరిచేయాలని గళమెత్తుతోంది. అప్పుడే విద్యార్థి దశ నుంచే పర్యావరణం గురించి అందరూ ఆలోచిస్తారని చెబుతోంది. 2019 మాడ్రిడ్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. వాతావరణ మార్పులపై యావత్ ప్రపంచం చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడింది. ఇంత చిన్న వయసులో తాను స్కూళ్లో ఆడుకోకుండా.. ఇక్కడకి వచ్చి వాతావరణ మార్పు గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ప్రశ్నించింది. నేను పుట్టకముందు నుంచే వాతావరణ మార్పుల సమస్య ఉందని.. ఐనా అంతర్జాతీయ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీసింది. కర్భన ఉద్గారాలు తగ్గించడంతో పాటు జీవ వైవిధ్యాన్ని పాటించినప్పుడే మన గ్రహాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పింది లిసిప్రియ.
యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ కాన్ఫరెన్స్ (COP25)లో గ్రెటా థన్‌బర్గ్‌ను కూడా కలిసింది లిసిప్రియ. వీరిద్దరు పర్యావరణం గురించి అద్భుతంగా ప్రసంగించారు. ప్రపంచ నేతలను ఏకిపారేశారు. మన భూమి గురించి కొంచెమైనా ఆలోచించాలని కోరారు. ఐతే స్వీడన్‌లో గ్రెటా చేస్తున్న పోరాటమే తనకు స్ఫూర్తి అని లిసిప్రియ కంగుజమ్ తెలిపింది.
పర్యావరణ కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ గతంలో పార్లమెంట్ ఆవరణలోనూ లిసిప్రియ బైఠాయించింది. చేతిలో ప్లకార్డులు పట్టుకొని కొన్ని వారాల పాటు అక్కడే ఉంది. ప్రధాని మోదీ పాటు ఎంపీల దృష్టిని ఆకర్షించాలని అనుకుంది. తనను చూసైనా.. కర్భన ఉద్గారాలను తగ్గించేలా వాతావరణ మార్పుల బిల్లును ప్రవేశపెడతారని భావించింది. కానీ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అన్ని రోజుల పాటు చేసిన ఆందోళన వృథా అయిపోయింది. మన నాయకులు స్టాక్ మార్కెట్లు, ఎన్నికల్లో ఓట్ల గురించే పట్టించుకుంటారని.. పర్యావరణం పాడవుతుంటే ఎందుకు స్పందిస్తారని ఆనాడే చురకలు అంటించింది. కానీ వాతావరణ మార్పులతో మనుషులు, జంతువులు, చెట్లు, సముద్రాలకు తీరని నష్టం జరుగుతుందని గ్రహించలేకపోతున్నారని విమర్శించింది.
ఈ యువ పర్యావరణవేత్త భవిష్యత్‌లో స్పేస్ సైంటిస్ట్ (అంతరిక్ష శాస్త్రవేత్త) కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. తన సొంత డబ్బులతోనే అక్కడికి వెళ్లి ప్రసంగించింది.
నీటి ఆదా కోసం హార్పిక్‌తో కలిసి న్యూస్18 మిషన్ పానీ (Mission Paani) కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా నీటి ఆదా, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది. మరిన్ని వివరాలను https://www.news18.com/mission-paani లో తెలుసుకోవచ్చు. తాజాగా చేపడుతున్న మిషన్ పానీ వాటర్‌థాన్‌లో మీరూ పాల్గోండి. ఇది 8 గంటలపాటూ టెలికాస్ట్ చేసే కార్యక్రమం. ఇందులో ప్రముఖులు ఎందరో పాల్గొంటున్నారు. వారంతా ఇండియాలో నీటి కొరత రానివ్వబోమని ప్రతిజ్ఞ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mission paani