నీటి కొరత కారణంగా మానవాళికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గత దశాబ్ధ కాలంగా భారతదేశంలో భూగర్భ, ఉపరితల నీటి వనరులలు నిరంతరం తగ్గుతూ వస్తున్నాయని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. సహజ సిద్ధంగా లభించే నీటిని పొదుపుగా వాడుకోకపోతే భవిష్యత్లో అనేక సంక్షోభాలు తలెత్తవచ్చని అనేక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ తీవ్రమైన సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అనేక నీటి సంరక్షణ పద్ధతులను అవలంభిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తోంది. దీనిలో భాగంగానే భారత ప్రభుత్వం తాజాగా మిషన్ పానీ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల దాహార్తి తీర్చేందుకు దేశ వ్యాప్తంగా ఇది వరకే కొన్ని గ్రామాల ప్రజలు సంఘంగా ఏర్పడి వారి నీటి సంరక్షణకు చక్కటి పరిష్కారాలు కనుగొన్నారు. తద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా నీటి వసతి కల్పించగలిగారు. వాటిపై ఓ లుక్కేయండి.
1. చెరువుల పునరుద్ధరణ–బుందేల్‌ఖండ్
చౌందేరి ఖేడా గ్రామానికి చెందిన సంఘం నాయకుడు చెరువుల పునరుద్ధరణను చేపట్టాడు. గంగా రాజ్‌పుత్ చందేలా రాజుల పాలనలో పురాతన కాలంలో నిర్మించిన ఈ చెరువులను పునరుద్ధరించడానికి తన ప్రాంతానికి చెందిన మహిళలను దీనిలో భాగస్వామ్యం చేశాడు. కరువు పీడిత ప్రాంతంలో ఈ సంఘం చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది. నీటి వృధాను అరికట్టడం, వర్షాకాలంలో చెరువులో వర్షపునీటిని సేకరించడం వంటి సంరక్షణా పద్ధతుల ద్వారా నీటి వృథాను అరికట్టగలిగారు.
2. వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్–అహ్మద్ నగర్
1990లలో మహారాష్ట్రలో తలెత్తిన కరువు కారణంగా అహ్మద్ నగర్ ప్రాంతం తీవ్ర ప్రభావితమైంది. దీని పరిష్కారానికి అక్కడి ప్రజలు సంఘంగా ఏర్పడి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ను అవలంభించారు. ఇది ఉత్తమ పరిష్కార మార్గంగా నిలిచింది. ఈ పద్ధతి ద్వారా వర్షాకాలంలో నీటిని సేకరించి, మిగిలిన ఏడాదంతా ఆ నీటిని ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. దీనికి గాను అక్కడి గ్రామస్థులు వాటర్‌షెడ్ నిర్మాణాలను చేపట్టారు. ప్రస్తుతం, ఇది చక్కటి ఫలితాలను ఇస్తోంది.
3. రూఫ్ హార్వెస్టింగ్–-ఈశాన్య భారతదేశం
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో స్పష్టమైన, ఖనిజాలతో కూడిన నీటి ప్రవాహాలను మనం చూడవచ్చు. పుష్కలమైన నీటి వనరులు ఉన్నప్పటికీ, చాలా మంది గిరిజన ప్రజలు తమ దాహార్తి తీర్చుకోవడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రూఫ్ హార్వెస్టింగ్ టెక్నిక్ ను అవలంభించారు అక్కడి మహిళలు. తద్వారా ఆ ప్రాంతంలో నీటి కొరతకు పరిష్కారం లభించింది.
4. రుజా–మిజోరం
వర్షపునీటిని మిజోరంలో వ్యవసాయం కోసం ఉపయోగిస్తారు. మిజోరం ప్రాంతం ఒక కొండ ప్రాంతం కాబట్టి, అక్కడి వర్షపు నీరు కొండలపై నుండి జూలువారుతూ ఉంటుంది. అందువల్ల, పుష్కలంగా నీరు లభిస్తున్నా, వారు ఆ నీటిని ఉపయోగించడంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దీని పరిష్కారానికి రుజా అనే కొత్త ప్రక్రియను అనుసరించారు. ఈ ప్రక్రియలో భాగంగా వెదురు పైపులను ఉపయోగించి వారి పొలాలకు నీటిని రవాణా చేస్తారు.
5. చౌకా–లాపోరియా
ఎడారి ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన రాజస్థాన్లో నీటి కొరత కారణంగా అక్కడి ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. అక్కడ తరచూ సంభవించే కరువుకు పరిష్కారం చూపడానికి లాపోరియా అనే చిన్న గ్రామంలో వినూత్న పద్ధతిని అనుసరించారు. నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి తొమ్మిది అంగుళాల లోతులో వాలుగా ఉండే దీర్ఘచతురస్రాకార గుంటలు, పచ్చిక భూమిలో తయారు చేయబడిన చౌకాను రూపొందించారు. దీనికి గాను ఆ గ్రామానికి చెందిన 350 కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాయి. వారి కృషికి ఇప్పడు చక్కటి ఫలితం లభించింది. ప్రస్తుతం, వారి గ్రామంలో ఎటువంటి నీటి సమస్య లేకుండా, మిగులు నీటిని పది పొరుగు గ్రామాలతోనూ పంచుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharashtra, Meghalaya, Mission paani, Mizoram, Rajasthan