నెట్ వర్క్ 18, హార్పిక్ ఇండియా సంయుక్తంగా చేపట్టిన మిషన్ ఇండియా వాటర్‌థాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, గజేంద్ర సింగ్ షెకావత్, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు పాల్గొన్నారు. జల సంరక్షణకు జలప్రతిజ్ఞ చేశారు. మిషన్ పానీ కార్యక్రమాన్ని అమిత్ షా అభినందించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ‘మిషన్ పానీ అనేది దేశంలో జల సంరక్షణ పరంగా మంచి ప్రభావం చూపిస్తుంది. భారత ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణలో కూడా దోహదపడుతుంది. మిషన్ పానీ కార్యక్రమాన్ని చేపట్టిన అందరికీ అభినందనలు.’ అని అమిత్ షా తన వీడియో సందేశంలో తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జలసంరక్షణ ఎంత అవసరమో దీని ద్వారా చాటిచెబుతున్నారన్నారు. ‘భారత నాగరికత నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది. నదులు, చెరువులు, కుంటల ద్వారా నీటిని పరిరక్షించడం సంప్రదాయంగా వస్తోంది. కానీ, కొంతకాలంగా ప్రభుత్వాలు, ప్రజలు కూడా ఆయా నదులను, సంప్రదాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు’ అని అమిత్ షా అన్నారు. నీటిని దుర్వినియోగం చేసే వారిపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. జల సంరక్షణకు మూడు సూత్రాలు చెప్పారు. ప్రస్తుతం ఉన్న నీటిని కాపాడుకోవడం, కొత్త నీటి వనరులను ఏర్పరచుకోవడం, నీటి వృధాను అరికట్టడం ముఖ్యమని స్పష్టం చేశారు. ‘మనం ఈ మూడు లక్ష్యాలను అధిగమిస్తే, మనం భవిష్యత్ తరాలకు సమృద్ధిగా భూగర్భజలాలను అందించగలం.’ అని షా స్పష్టం చేశారు.
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ తాను బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్నప్పటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తాము గ్రామాలకు నీటిని శుద్ధి చేసి సరఫరా చేయాలనుకున్నామన్నారు. అయితే, అది చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో వర్షపునీటిని కాపాడుకునే వ్యవస్థ అందుబాటులో లేదని, భవిష్యత్తులో రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్ రైల్వేస్‌లో ఉన్న అన్ని కోచ్‌ల్లోనూ బయో టాయిలెట్లు ఉన్నాయని చెప్పారు. రైల్వేస్‌లో నీటిని రీసైకిల్ చేసి వినియోగించుకోవాలనుకుంటున్నామని చెప్పారు.
"I appeal to our countrymen to save water and I hope @Network18Group's initiative of #MissionPaani will make people understand the importance of conserve water," says Union Home Minister @AmitShah during @harpic_india-News18 Mission Paani Waterthon.#MeriJalPratigya pic.twitter.com/5Kk2RTsIhq
— News18 (@CNNnews18) January 26, 2021
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ కూడా మిషన్ పానీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమామి గంగే ప్రాజెక్టు ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగా నదిని పరిశుభ్రంగా మార్చే ప్రతిజ్ఞ చేపట్టారని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కూడా గంగా నది ప్రక్షాళనకు నడుం బిగించిందన్నారు. తమ రాష్ట్రంలో ప్రవహించేంత మేరా నదిని పరిశుభ్రంగా చేయాలని కంకణం కట్టుకున్నామన్నారు. నీటి సంరక్షణ ప్రాధాన్యతను యూపీ సీఎం నొక్కిచెప్పారు. ఇక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన జలజీవన యోజనను ప్రస్తావించారు. దేశంలో ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రతి నీటి చుక్క కూడా విలువైనదని స్పష్టం చేశారు.
ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వ్యాఖ్యాత, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఈ మిషన్ పానీ వాటర్‌థాన్ 8 గంటల పాటు కొనసాగింది. దేశంలో నీటి కొరత, నీటి సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెట్ వర్క్ 18, హార్పిక్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Mission paani, Mission pani, Rajnath Singh