MINISTRY OF FINANCE IS CONSIDERING CUTTING EXCISE DUTIES ON PETROL AND DIESEL TO CUSHION THE IMPACT OF RECORD HIGH DOMESTIC PRICES SSR
Petrol Prices: పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని చింతిస్తున్నారా.. ఇది తెలుసుకుని రిలాక్స్ అవ్వండి..!
ప్రతీకాత్మక చిత్రం
గత 10 నెలల్లో క్రూడ్ ఆయిల్ ధరలు రెట్టింపు కావడమే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం. కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే ఇంధన ధరలకు సంబంధించి సంబంధిత మంత్రిత్వ శాఖతో పాటు, పలు రాష్ట్రాలతో, ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు ...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించే దిశగా అడుగులేస్తున్నట్లు సమాచారం. పైపైకి ఎగబాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. గత 10 నెలల్లో క్రూడ్ ఆయిల్ ధరలు రెట్టింపు కావడమే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం. కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే ఇంధన ధరలకు సంబంధించి సంబంధిత మంత్రిత్వ శాఖతో పాటు, పలు రాష్ట్రాలతో, ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. వాహనదారులపై భారాన్ని తగ్గించాలంటే ట్యాక్స్‌లను తగ్గించక తప్పదన్ నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. ఇంధన ధరలను నిలకడగా ఉంచేందుకు చర్చలు జరుపుతున్నామని, మార్చి నెల నాటికి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే.. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. లీటర్ డీజిల్, పెట్రోల్ ధరలు వంద రూపాయలకు చేరువవుతుండటం గమనార్హం. పెట్రోల్‌పై రూ.32.90 మేర కేంద్రం ఎక్సైజ్ పన్ను విధిస్తుండగా, వ్యాట్ పేరిట రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 36 శాతం దాకా భారం మోపుతున్న పరిస్థితులున్నాయి. మరికొన్ని రాష్ట్రాలైతే వ్యాట్‌తో పాటు అదనంగా లీటర్‌పై రూ.2 నుంచి నాలుగు రూపాయల దాకా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. చమురు ధరలు దిగిరావాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవడం గురించి ఆలోచించాలని, బహుశా అదే పరిష్కారమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అదే మాట అనేవారని ఆమె గుర్తుచేయడం గమనార్హం. అయితే.. ఇదేగానీ జరిగి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాల ఆదాయం భారీగా పడిపోతుంది. దేశంలోని చాలా రాష్ట్రాలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదన చేసినా రాష్ట్రాలు అందుకు ఎంతవరకూ సహకరిస్తాయో సందేహమే.