40 మంది అమరజవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై.. యావత్ దేశం కన్నెర్ర జేస్తోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయుల రక్తం మరుగుతోంది. పాకిస్తాన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పుల్వామా ఉగ్రదాడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడికి మూలాలు పాక్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ఆయన అమాయకపు ముసుగును తొలగించుకోవాలని సూచించారు.
టీవీ కెమెరాల ముందు కూర్చుని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నీతివాక్యాలు బోధించడం, మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని అసద్ సూచించారు. ఇకనైనా అమాయకపు ముసుగు తొలగించుకోవాలన్నారు. ఇప్పటికే పఠాన్‌కోట్, ఉరీ ఘటనలు జరిగాయని.. ఇప్పుడు మరోసారి పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడ్డారని పాకిస్థాన్‌పై మండిపడ్డారు. భారత్‌లో ముస్లింల గురించి పాకిస్థాన్ ఆలోచించాల్సిన అవసరం లేదన్న అసద్.. ఇక్కడి ముస్లింలు భారత్‌ను ఎప్పుడో సొంతదేశంగా భావించారని గుర్తు చేశారు.
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఇమ్రాన్‌ఖాన్‌కు ఘాటు హెచ్చరికలు చేసిన అసదుద్దీన్.. భారత్‌లో గుడిగంటలు మోగినవ్వమంటూ తాజాగా ఓ పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలపైనా ఘాటుగా స్పందించారు. భారత్‌లో ముస్లింలు ఉన్నంత కాలం గుడిలో గంటలు, మసీదులో ఆజా వినిపిస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు బతికున్నంత కాలం కలిసే ఉంటారని, అదిచూసి పాకిస్థాన్ ఓర్వలేక పోతోందని అసద్ ఆరోపించారు.
పుల్వామా ఉగ్రదాడి కచ్చితంగా పాకిస్తాన్ పనేనన్న అసద్.. పాక్ సైన్యం, అక్కడి ప్రభుత్వం, ఐఎస్ఐ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాయన్నారు. దీనికి భారత ఇంటెలిజెన్స్ లోపం కూడా ఒక కారణమన్నారు. జైషే మహ్మద్ సంస్థను జైషే షైతాన్‌గా అభివర్ణించిన అసద్.. నిజమైన మహమ్మదీయుడు వ్యక్తి ప్రాణాలను తీయడన్నారు. ముంబైలోని ఓ బహిరంగసభలో మాట్లాడిన అసదుద్దీన్.. కాషాయం రంగు తలపాగా ధరించి ప్రత్యేకంగా నిలిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asaduddin Owaisi, Imran khan, Mumbai, Pakistan, Pulwama Terror Attack